ఖైరతాబాద్, ఆగస్టు 6: ఢిల్లీలో కాంగ్రెస్ రాజకీయ హంగామా చేస్తున్నదని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభత్వం మొదటి నుంచి డ్రామాలాడుతున్నదని ఆరోపించారు. ఢిల్లీ ధర్నాతో రాహుల్, ప్రియాంక, సోనియా, ఖర్గేల మెప్పు పొందే ప్రయత్నాలను రేవంత్ చేస్తున్నాడని విమర్శించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా పోరాడి బీసీ హక్కులను సాధించుకుంటామని స్పష్టంచేశారు. రిట్ ఆఫ్ మాండమస్ వేసి సుప్రీంకోర్టు ద్వారా బిల్లులపై త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా చొరవ తీసుకునే అవకాశం ఉన్నదని, ప్రభుత్వం ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటేనే నమ్మకం లేదని, విద్యా, ఉద్యోగాల్లో ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నదని తెలిపారు.