హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : కూరగాయల స్వయం సమృద్ధిలో దేశంలోనే మాడల్ కూరగాయల హబ్‌గా ఎదిగేందుకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉన్నదని వ్యవసాయ సాంకేతిక పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ షేక్ మీరా అన్నారు. తెలంగాణ ఉద్యాన వర్సిటీ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షేక్మీరా మాట్లాడారు. దేశంలో ఆహార భద్రత, పోషక భద్రత కూరగాయల సాగుతోనే సాధ్యమవుతుందని తెలిపారు. వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ.. కూరగాయ సాగులో తకువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వేదికగా కూరగాయల సాగు మహోద్యమంగా సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు డాక్టర్ చీనా, లక్ష్మీనారాయణ, సురేశ్‌కుమార్, ప్రశాంత్, కూరగాయల పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ అనితకుమారి, ఉద్యానశాఖ జేడీఏ పద్మనాభ, శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుల వృత్తిదారుల అభ్యున్నతికి కోసం నాడు కేసీఆర్ సర్కార్ గొర్రెల పంపిణీ చేపట్టిందని గుర్తుచేశారు. ఫలితంగానే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో గొల్లకురుమలకు గొర్రెలను పంపిణీ చేస్తామని కాంగ్రెస్ నాడు హామీ ఇచ్చిందని, కానీ ఈ రెండున్నరేండ్ల పాలనలో ఆ పథకాన్ని అటకెక్కించిందని మండిపడ్డారు. మళ్లీ గొర్రెల పంపిణీకి బదులు నగదు పంపిణీ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని నిప్పులు చెరిగారు.