హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్ కేసులో సూత్రధారి పవన్‌కుమార్ అలియాస్ లియోన్, ఆయనతో పాటు ఏ-15గా ఉన్న ప్రదీప్ కుమార్ గుప్తాను సీఐడీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరింది. కేసు వివరాల్లోకి వెళ్తే వైద్యులు రాజశేఖర్, అవినాశ్ ఇతర డాక్టర్లతో కలిసి దాతలు, కిడ్నీలు అవసరం ఉన్న వారి వివరాలు సేకరించి, అలకనంద, జనని, అరుణ దవాఖానాల్లో అక్రమంగా కిడ్నీల మార్పిడి చేశారు. కిడ్నీలు సేకరించేందుకు పేదలను ఎంపిక చేయడంలో పవన్‌కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఇందుకోసం తమిళనాడు, బెంగళూరు, హరియాణాలో మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్నాడు.
పవన్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు దర్యాప్తులో కీలక వివరాలు గుర్తించారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి పవన్ రూ.10-15 లక్షల వరకు కమీషన్ తీసుకునేవాడు. ఆ డబ్బులతో విలావంతమైన కార్లు కొనేవాడు. శ్రీలంకకు వెళ్లి కాసినో ఆడేవాడు. ఈ కేసులో అరెస్టయిన మరో నిందితుడు ప్రదీప్‌కుమార్ గుప్తా.. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో కిడ్నీ అవసరం ఉన్న వారిని గుర్తించేవాడు. నిందితులను పో లీసులు బుధవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో ఇప్పటివరకు వైద్యులు, దవాఖానల నిర్వాహకులు, దళారులు 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.