చిగురుమామిడి, డిసెంబర్ 30 : జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షలకు పైగా మందులను పంపిణీ చేశామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లింగారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పీచుపల్లి గ్రామంలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా 5. 20 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయన్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు 4 లక్షలకు పైగా మందులను పంపిణీ చేశామన్నారు.
జిల్లాలో 25 పశు వైద్య కేంద్రాలు, 37 సబ్ సెంటర్లు ఉన్నాయన్నారు. ఇందుకుగాను 63 టీం లను ఏర్పాటు చేసి గ్రామాల్లో గొర్రెలు, పశువులకు నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తామన్నారు. మరో రెండు రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. శీతాకాలంలో పశుపోషకులు పశువుల పెంపకంలో జాగ్రత్తలు వహించాలన్నారు. మూగజీవాలు శీతాకాలంలో వచ్చే వ్యాధులతో ఎదుగుదల లోపించి రోగాల బారిన పడతాయన్నారు.
రోగాలను ముందస్తుగా నివారించడానికి ప్రభుత్వం నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తామన్నారు. దీని ద్వారా గొర్రెలు, మేకల మరణాలు తగ్గుట, బరువు పెరుగుతాయన్నారు. పశువులలో పేడ పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన వ్యాధులను గుర్తించి జలగ పురుగులు నివారణకు మందులను పంపిణీ చేస్తామన్నారు. ఆయన వెంట అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, స్టేట్ మానిటరింగ్ అధికారి డాక్టర్ షకీల్, పశువైద్యాధికారులు తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, కే. సాంబారావు, సిబ్బంది పాల్గొన్నారు.