జడ్చర్లటౌన్, మార్చి 23 : తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకం వంటి పథకాలతోపాటు అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేసిందని, కానీ రెండేండ్ల కాలంలోనే కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన రూ.3.5 లక్షల కోట్ల అప్పులు ఏటుపోయాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని అంబేద్కర్ కళాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులు ఏమి చేశారో ప్రజలు ఆలోచన చేయాలి, దీనిపై ఊరూరా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రెండేండ్ల కాలంలో ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏ ఒక్క హామీ నేరవేర్చలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడో సారి ప్రవేశపెట్టిన బడ్జెట్లోనైనా ఏమో చేస్తారని ప్రజలు ఆశపడ్డారని, బడ్జెట్ చూస్తే గుండు సున్నా తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. రేవంత్రెడ్డి పాలనలో సరైన కరెంట్, సాగు నీళ్లు లేక, ఎరువులు దొరక్క.. పంటలు ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.