Jayaprakash Narayan | హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డా. జయప్రకాష్ నారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి రైతుల అప్పులు తీర్చడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం అభివృద్ధిలో సమతూకం పాటించారని, మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, పెట్టుబడులు కూడా భారీగా వచ్చాయని ప్రశంసించారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన రోజు దేశంలో అతి ఎక్కువ మిగులు ఉన్న రాష్టంగా ఉండేదని, 14వ ఆర్థిక సంఘం నివేదికలో రూ.1.16లక్షల కోట్ల రెవెన్యూ మిగులు రాష్ట్రంగా చూపారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్-1గా ఉందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 31వేల కోట్లు అప్పులు తెచ్చి రైతుల అప్పులు తీరుస్తున్నారని, ప్రపంచంలోనే అనితర సాధ్యమైనదాన్ని సాధించినట్టు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా అప్పులు సకాలంలో చెల్లించేవాడు మూర్ఖుడు.. ఎగ్గొట్టేవాడు తెలివిగలవాడు అనే సంకేతాలు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. అంతేకాదు, రుణాలు తీసుకోండి.. మేము వచ్చాక మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికలప్పుడు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇదేనా సమాజానికి మనం ఇచ్చే సంకేతం అని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల రేపు రైతులకు రుణాలు వస్తాయా? బ్యాంకులు అప్పులు ఇవ్వకపోతే మళ్లీ రైతులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది అన్నారు.
రైతుల పేరు చెప్పి రైతులను భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నాం.. సమాజాన్ని నాశనం చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థను పతనం చేస్తున్నాం అని జేపీ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలోని సమస్యలు తెచ్చిపెట్టుకున్నవని, స్వయంకృతాపరాధమని చెప్పారు. బంగారంలాంటిది ఉంటే దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం కాకుండా అధికారం వస్తే రాష్ట్రం సర్వనాశనం అయినా ఫరవాలేదనేలా వ్యవహరించారని అన్నారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే పచ్చటి రాష్ట్రంలో చిచ్చుపెట్టినవాళ్లవుతారని పేర్కొన్నారు. హైదరాబాద్ బంగారు గుడ్డుపెట్టే బాతు వంటిది అయినందున ఇప్పటికైనా ఆర్థిక ఇబ్బందల నుంచి బయటపడడం సాధ్యమేనని స్పష్టం చేశారు. అవినీతి వల్ల, అసమర్థత వల్ల, మూర్ఖపు విధానాల వల్ల ఈ బంగారు బాతును చంపకుండా ఉంటే తెలంగాణను కాపాడుకోవచ్చని చెప్పారు.
జాబ్ క్యాలెండర్ అబద్ధం…
జాబ్ క్యాలెండర్ అంత పచ్చి అబద్ధం మరొకటి లేదని జయప్రకాష్ నారాయణ అన్నారు. వందమంది సమాజంలో పనిచేస్తుంటే అందులో ముగ్గురికే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని, ఆ ముగ్గురు కూడా మనకి పనికొచ్చే పని చేయడంలేదని అన్నారు. కూర్చునే కుర్చీ దగ్గర్నుంచి, చేతికి పెట్టుకునే వాచీ, వేసుకునే బట్టల వరకు ఏవీ ప్రభుత్వం తయారు చేయడంలేదని అన్నారు. జాబ్ క్యాలెండర్ కేవలం డ్రామా అన్నారు. వంద ఉద్యోగాలకు లక్ష మంది పోటీ పడుతుంటే, వయో పరిమితి పెంపు ద్వారా రెండు లక్షల మంది పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. అయినా వస్తున్న ఉద్యోగాలు వంద మాత్రమేనని తెలిపారు. మిగిలినవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ద్వారా అందరికీ ఉద్యోగాలు వస్తాయనడం పచ్చి అబద్ధమని స్పష్టంచేశారు.
కలెక్టర్ కన్నా ప్లంబర్అవసరమే ఎక్కువ…
ఎక్కడో దూరంగా ఉన్న కలెక్టర్ కన్నా బాత్రూమ్ తూముల్లో పూడికతీసే ప్లంబర్ చాలా మిన్న అని జేపీ చెప్పారు. కలెక్టర్ లేకుంటే ఎవరికైనా నష్టం జరిగిందా, కలెక్టర్ లేకపోవడంవల్ల నా బతుకు చిందరవందర అయిందనేవారు ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించారు. బాత్రూమ్ తూములో పూడిక తీయకపోతే మీరు బతకగలరా అని చెప్పారు.