హైదరాబాద్, సిటీబ్యూరో, జులై 1, (నమస్తే తెలంగాణ): ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఇంద్రజాలికుడు, హిప్నాటిస్ట్ బీవీ పట్టాభిరామ్(75) సోమవారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. జయ కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరు పొందారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ప్రశాంత్ శుక్రవారమే తిరిగి వెళ్లారు. అక్కడ దిగగానే తండ్రి మరణవార్త తెలియడంతో తిరిగి ఇండియాకు బయలుదేరారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఖైరతాబాద్‌లోని పట్టాభిరామ్ నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
కండ్లకు గంతలు కట్టుకొని స్కూటర్ డ్రైవింగ్
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారాయణ సంతానంలోని పదిహేను మందిలో పట్టాభిరామ్ ఒకరు. 1950 ఫిబ్రవరి 12న జన్మించిన పట్టాభిరామ్ కౌమారదశలో కాలికి వైకల్యం ఏర్పడింది. అయినప్పటికీ ఆత్మన్యూనత నుంచి బయటపడి ఇంద్రజాలికుడిగా, రచయితగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. హైదరాబాద్‌లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేశారు. 1984లో హైదరాబాద్‌లో కండ్లకు గంతలు కట్టుకొని రవీంద్రభారతి నుంచి చార్మినార్ వరకు స్కూటర్ నడిపి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంద్రజాల విద్యను ఆయుధంగా చేసుకుని బాణామతి, చేతబడులు వంటి మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. హిప్నాటిజం ద్వారా అనేక రుగ్మతల్ని రూపుమాపారు.
భారత్ మ్యాజిక్ సర్కిల్ ఏర్పాటుకు కృషి
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ప్రభుత్వ పథకాలు, మధ్యపాన నిషేధ కార్యక్రమాల్లో ఇంద్రజాలాన్ని జోడించి ప్రజల్లో అవగాహన కల్పించారు. బధిరులకు విఙ్ఞానం పెంచే ప్రదర్శనలిచ్చారు. గోదావరి వరద బాధితులకు సహాయార్థం అనేక ప్రదర్శనలిచ్చారు. దేశంలోనే తొలిసారిగా భారత్ మ్యాజిక్ సర్కిల్ ఏర్పాటు చేశారు. ఆకాశవాణి, దూరదర్శన్లలో ఇంద్రజాల విద్యను ఓ విఙ్ఞానశాస్త్రంగా ప్రచారం చేసిన ఘనత పట్టాభిరామ్కే సొంతం.