అంతర్జాతీయ సదస్సు అంటే ఎలా ఉండాలి. హాజరయ్యే దేశ, విదేశీ అతిథులకు ఎలాంటి లోటు రాకుండా సకల ఏర్పాట్లు చేయాలి. వారికి రాష్ట్ర అభివృద్ధి కండ్లకు కట్టాలి. ముఖ్యంగా రాజధాని నగర వైభవాన్ని, ఇక్కడి అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను అర్థమయ్యేలా చూపించగలగాలి. ప్రభుత్వ విజన్‌ను ప్రపంచం ముందు ఉంచగలగాలి. ఇందుకోసం అద్భుతమైన సౌకర్యాలు ఉన్న ప్రాంగణాలను ఎంపిక చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అనుసరించే విధానం ఇది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులను సైతం ఈ ప్రమాణాలతోనే నిర్వహించారు.
విశాలమైన ఖాళీ ప్రాంతంలో మీటింగ్‌లు పెట్టడం, వచ్చే అతిథుల కోసం డేరాలు వేయడం, అప్పటికప్పుడు రోడ్లు బాగు చేయడం, తాత్కాలికంగా మౌలిక వసతులు కల్పించడం, అతిథులు ఆహా అనేలా వంటకాలను వండించడం.. ఇలాంటివన్నీ సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తుంటాయి. ఆదివారం, ఇతర సెలవుదినాల్లో హైదరాబాద్ నగరం చుట్టూ ఎక్కడికి వెళ్లినా రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఈ టెంట్లు కనిపిస్తుంటాయి.
హైదరాబాద్‌సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ (Global Summit) ఇందులో ఏ కోవలోకి వస్తుందో వారే చెప్పాలి. పెట్టుబడులను ఆకర్షించడమంటే నాలుగు శతాబ్దాల హైదరాబాద్ (Hyderabad) నగరాభివృద్ధి ప్రస్థానాన్ని చూపించకుండా ఖాళీ భూముల్లో తాత్కాలిక డేరాలు వేసి సదస్సు నిర్వహించడమా? అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఖాళీ భూములను చూసి పెట్టుబడులు పెడతారా.. లేదా నగరంలోని మౌలిక వసతులు, భౌగోళిక పరిస్థితులను చూసి ముందుకొస్తారా? ఇంతకీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫోర్త్ సిటీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ పెట్టుబడుల కోసమా? ఫోర్త్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ ప్రమోషన్ కోసమా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతున్నది. అభివృద్ధి చెందిన రాజధాని నగరంలేని ఆంధ్రప్రదేశ్ సైతం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు వైజాగ్ నగరాన్ని ఎంచుకుంది. ఆ నగరాన్ని చూపించి రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయంగా పేరున్న హైదరాబాద్‌ను పక్కనపెట్టి, కనీసం రోడ్లు కూడా లేని ఫోర్త్ సిటీని వేదికగా ఎంచుకోవడం ‘రియల్ ఎస్టేట్ ప్రమోషన్’ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నది.
అంతర్జాతీయ స్థాయి వేదికలను కాదని..
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల పాలనతో పాటు 2047 విజన్ డాక్యుమెంట్ పేరిట పెట్టుబడులను ఆకర్షించేందుకు అట్టహాసంగా ప్రారంభించిన గ్లోబల్ సమ్మిట్ అందరినీ అయోమయానికి గురి చేస్తున్నది. రాజధాని నగరంలో జరిగిన అభివృద్ధిని చూపించి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించకుండా, సరిగా రహదారుల వ్యవస్థలేని ఖాళీ భూముల్లో అంతర్జాతీయ సదస్సుని ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామనడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సును నిర్వహణకు రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించిన అద్భుతమైన వేదికలు ఉన్నాయి. హైటెక్స్తోపాటు హెచ్ఐసీసీ పరిధిలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి. గతంలో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ సదస్సులను నిర్వహించిన అనుభవం ఉన్నది.
అమెరికా, ఇతర దేశాధ్యక్షులతో పాటు ప్రపంచంలోనే పేరెన్నికగన్న అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు పాల్గొన్న సదస్సులను ఈ వేదికల్లోనే నిర్వహించారు. నాలుగు శతాబ్దాల హైదరాబాద్ నగరాభివృద్ధిని చూపడంలో ఈ వేదికలు కీలక పాత్ర పోషించాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు అవుటర్ రింగు రోడ్డు మీదుగా ఈ ప్రాంగణాల దగ్గరకు వచ్చే మార్గమధ్యంలో నగరంలోని అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, ఆకాశహర్మ్యాలు ఇలా ఎన్నో హంగులు వారిని ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తాయి. వాస్తవానికి కంపెనీల ప్రతినిధులు కోరుకునేది కూడా ఇదే. ఇందులో ఆర్భాటంగా సదస్సు నిర్వహించినా ప్రభుత్వానికి రూ.పది కోట్లకు మించి ఖర్చు కాదు. కానీ రేవంత్ సర్కారు మాత్రం వీటిని కాదని ఫోర్త్ సిటీని ఎంచుకోవడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మిట్ ప్రారంభోత్సవానికి హాజరైనవారిలోనూ ఇలాంటి అనుమానాలే తలెత్తాయి.
ఖాళీ భూముల్లో కనిపిస్తున్నదేంది?
కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీలో తాత్కాలిక ఏర్పాట్ల మధ్య గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ ఫార్మా సిటీ కోసం సేకరించిన 14వేల ఎకరాల భూమిని ఫోర్త్ సిటీగా మార్చి ఈ అంతర్జాతీయ సదస్సుకు వేదికగా ఎంచుకుంది. కేసీఆర్ హయాంలో వేసిన రోడ్లను వినియోగించుకుంది. రోడ్డులేని చోట తాత్కాలికంగా మట్టితో రోడ్డు వేసింది. రోడ్లు మినహా అక్కడలేమీ లేకపోవడంతో కరెంటు, ఇంటర్నెట్, సీసీ కెమెరాలు, ఇతరత్రా వాటికి తాత్కాలిక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. వీటి కోసం ఏకంగా రూ.వంద కోట్లకు పైగా ఖర్చు చేసింది. సదస్సుకు వచ్చిన ప్రతినిధులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫోర్త్ సిటీకి చేరుకుంటారు. రెండ్రోజుల సదస్సు కావడంతో కొందరికి అక్కడే బస ఏర్పాట్లు చేయగా, మరికొందరికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోని స్టార్ హోటళ్లలో ఏర్పాట్లు చేశారు. సమ్మిట్ ముగిసిన వెంటనే వారు కనీసం హైదరాబాద్ నగరాన్ని చూడకుండానే తిరిగి వెళ్లిపోతారు. అక్కడ చేపట్టిన ఏర్పాట్లన్నింటినీ తొలగిస్తారు. తిరిగి అక్కడ ఖాళీ భూములే దర్శనమిస్తాయి. అంటే అంతర్జాతీయ ప్రతినిధులు హైదరాబాద్ నగరాభివృద్ధి, మౌలిక వసతులను చూసే అవకాశం లేకపోగా రూ.వంద కోట్లకు పైగా వ్యయంతో చేసిన ఏర్పాట్లన్నీ మరోసారి వినియోగించే అవకాశమే లేకుండా పోతుంది.
ఏడాదిన్నరగా రియల్ ‘ఢాం’
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ భూముల్లో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఆపై కొన్నాళ్లకు శంకుస్థాపన చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అంటే గత ఏడాదిన్నరగా అక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం. అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించే నిర్మాణాలుగానీ, అభివృద్ధిగానీ, చివరకు మౌలిక వసతులుగానీ లేని చోట గ్లోబల్ సమ్మిట్ ఎందుకు నిర్వహిస్తున్నట్టు? అనే సందేహం అందరిలో కలుగుతున్నది. తాత్కాలిక డేరాలు తప్ప ఏమీ లేనిచోట పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారు? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే వాస్తవానికి ఇది పెట్టుబడుల ఆకర్షణ కోసం కాదని, రియల్ ఎస్టేట్ కోసమని విశ్లేషకులు చెప్తున్నారు. ఏడాదిన్నర కాలంగా సీఎంతో సహా మంత్రులు, అధికార యంత్రాంగం ఫోర్త్ సిటీ స్మరణను చేస్తున్నా అక్కడ రియల్ బూం కనిపించడం లేదు. గతంలో మాదిరిగానే చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతున్నదని వ్యాపారులు చెప్తున్నారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం ఎంత శ్రమటోడ్చినా అక్కడ రియల్బూం రాకపోవడంతో కనీసం అంతర్జాతీయ సదస్సు ద్వారానైనా వ్యాపారం పెరుగుతుందనే ఉద్దేశంతోనే సదస్సు నిర్వహిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నగరంలోని వసతులు గ్లోబల్ సమ్మిట్‌కు ఫోర్త్ సిటీలో చేసిన ఖర్చు
నగరంలోని వేదిక
ఫోర్త్ సిటీలోని వేదిక