హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్‌పై సందిగ్ధత నెలకొన్నది. ఈ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపినా ఇంతవరకు అది ముందుకు సాగలేదు. క్యాబినెట్ నోట్ ఇంకా జెన్కోకు అందలేదు. దీంతో అధికారులు ఈ ప్లాంట్ నిర్మాణంపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ ప్లాంట్ విషయంలో సర్కారు ఏదో ఒక మెలిక పెడుతున్నది. దీంతో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనుకకు అన్న చందంగా మారింది. ప్రాజెక్టును జెన్కోకు ఇవ్వడం ఇష్టంలేకనే ఇలా రోజుకో కొత్త కథను తెరపైకి తెస్తున్నారని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో ఈ థర్మల్‌ప్లాంట్‌ను సింగరేణి, జెన్కో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తాయని సర్కారు మొదట్లో ప్రకటించింది. దీనిని విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సింగరేణిని తప్పించారు. ఈ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను జెన్కోకు అప్పగించడం లాంఛనమే అనుకున్నారంతా. డీపీఆర్ సిద్ధం కాగా, పర్యావరణ అనుమతుల కోసం జెన్కో అధికారులు అంతా సిద్ధం చేశారు. ఈ తరుణంలో సర్కారు మరో మెలికపెడుతూ.. ఈ ప్లాంట్‌ను ఎన్టీపీసీ లేదా టీజీ జెన్‌కోల్లో ఏదో ఒక సంస్థకు అప్పగిస్తామని తెలిపింది. నిర్మాణ వ్యయం విషయంలో ఎన్టీపీసీతో పోల్చితే జెన్కో కోట్ చేసిందే తక్కువగా ఉంది. ఈ లెక్కన చూసినా జెన్కోకు అప్పగించాలి. ఇలా ఆలస్యమయ్యే కొద్ది నిర్మాణ వ్యయం పెరుగుతున్నది. ఇప్పుడున్న దానికి మరికొంత భూసేకరణ చేయాల్సి ఉంటుందని, కాబట్టి ఏదో ఒకటి తేల్చాలని అధికారులంటున్నారు.
పాత ప్లాంట్ కూల్చివేతకు ఉత్తర్వులు
రామగుండంలో 62.5 మెగావాట్ల థర్మల్‌ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ 50 ఏండ్ల నాటిది కావటంతో తరుచూ మరమ్మతులు తలెత్తుతున్నాయి. ఈ ప్లాంట్ స్థానంలో కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మించాలని జెన్కో ప్రతిపాదించింది. ఇటీవలే పాత ప్లాంట్‌ను తొలగింపునకు జెన్కో ఉత్తర్వులు జారీచేసింది. పాత పరికరాలు/స్క్రాప్‌ను వేలం వేయనున్నారు. కొత్తగూడెంలో 720 మెగావాట్ల ప్లాంట్‌ను మూసివేస్తే. వందల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కన రామగుండం ప్లాంట్ స్క్రాప్ వేలంతో రూ.80 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. మొదట జెన్కో అంచనాలను రూపొందిస్తుంది. ఆ తర్వాత థర్డ్ పార్టీ ఏజెన్సీ అంచనాలు సిద్ధం చేస్తుంది. ఎంఎస్టీసీ ద్వారా ఆన్లైన్ వేలం వేస్తారు. వేలంలో ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికే స్క్రాప్, కూల్చివేతల టెండర్లు దక్కుతాయి.