హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): సీఎం సొంత నియోజకవర్గం లో ప్రారంభించిన కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీకి అనుమతులొచ్చేనా..? వచ్చే విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ ఈ కాలేజీకి అనుమతులిస్తుందా..? అంటే అనుమానంగానే కనిపిస్తున్నది. ఈ కాలేజీకి ఇప్పటి వరకు సొంత భవనం లేకపోవడం, స్థల సేకరణ జరగకపోవడంతో అనుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
నిరుడు కోస్గి పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేశారు. పాలిటెక్నిక్ కాలేజీ పక్కనున్న ఐదారెకరాల స్థలాన్ని కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు. దీనిపైనా ప్రభు త్వం ఏదీ తేల్చడంలేదు. వసతులు, పూర్తిస్థాయి పోస్టులను మంజూరుచేయలేదు. వీటన్నింటి ప్రభావం ఏఐసీటీఈ అనుమతులపై పడుతుందని అధికారులు కలవరపడుతున్నారు.