హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో పోల్చితే ఏపీకి పదిరెట్లు ఎక్కువగా నిధులు ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం 11 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బండి సంజయ్ బుధవారం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే ఏపీకే ఎకువగా ఆర్థికంగా మేలు చేశామని చెప్పారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్నులు, పన్నేతర ఆదాయం రూపంలో రూ.95,500 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రత్యేకంగా మరో రూ.30,334 కోట్లు, మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయం పథకం కింద రూ.5,604 కోట్లు అందజేశామని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.22 వేల కో ట్ల బాండ్లు, ప్ర పంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హ డో నుంచి రూ.12 వేల కోట్లు, జర్మనీ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్ల నిధులను సమీకరించినట్టు వెల్లడించారు.
ప్రధాన మం త్రి విశాఖ పర్యటన సందర్భంగా రూ.2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు. 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం మంజూరు చేస్తే, ఇందులో ఏపీకే 8 కేవీలను ఇచ్చామని తెలిపారు. అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలను స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఎంపిక చేశారని, చెన్నై-బెంగళూరు, విశాఖపట్నం-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లను, భోగాపురం, ఓర్వకల్, దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకు ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఇలా తెలంగాణతో పోల్చితే ఏపీకి పదిరెట్లు అధికంగా నిధులు ఇచ్చామని, ఏపీ ప్రజలు అదృష్టవంతులని అన్నారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, నెటిజన్లు మండిపడుతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని మరోసారి తేలిపోయిందని భగ్గుమన్నారు. తెలంగాణ నుంచి ఎంపీగా గెలిచి, కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగినా తెలంగాణకు నిధులు సాధించడంలో విఫలం అయ్యానని బండి సంజయ్ ఒప్పుకున్నట్టేనని చెప్తున్నారు. చివరికి సొంత నియోజకవర్గం కరీంనగర్‌కు కూడా నిధులు తెచ్చుకోవడంలో దారుణంగా విఫలమయ్యారని ఎద్దేవాచేస్తున్నారు.
ఎనిమిది మంది ఎంపీ లు ఉన్నా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదన్న వాదనలను బండి వ్యాఖ్యలు సమర్థిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఏపీకి రూ.లక్షల కోట్లు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై పదేండ్లుగా ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో చెప్పాలని డిమాం డ్ చేస్తున్నారు. ఏపీకి భారీగా నిధులు కేటాయించడాన్ని తప్పుబట్టడం లేదని, అయితే తెలంగాణ అభివృద్ధిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకే నిధులు కేటాయిస్తారా? అంటూ బండి సంజయ్‌ని నిలదీస్తున్నారు.