నంగునూరు, సెప్టెంబర్ 23 : చీటీ డబ్బులు కట్టలేదని రేషన్ డీలర్ ఓ నిరుపేదను రోడ్డున పడేశాడు. తనకు రావాల్సిన డబ్బుల కోసం బలవంతంగా డబుల్ బెడ్రూం ఇంటిని అమ్మేశాడు. తన బకాయి పోనూ మిగతా డబ్బులు కూడా తన వద్దే పెట్టుకొని ఆరు నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇల్లు, డబ్బులు పోయి బాధితుడు లబోదిబోమంటున్నాడు.
సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం వివరాలు ఇలా.. నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీక్‌కు బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైంది. రఫీక్ కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన రేపాక లక్ష్మారెడ్డి అనే రేషన్ డీలర్ వద్ద చీటీ కడుతున్నాడు.
పదినెలలుగా డబ్బులు కట్టకపోవడంతో రూ.లక్ష బకాయి పడ్డాడు. ఆ డబ్బుల కోసం ఒత్తిడి పెంచడంతోపాటు బలవంతంగా అతడి డబుల్ బెడ్రూం ఇంటికి బేరానికి పెట్టాడు. ఆరు నెలల క్రితమే రూ.2.70 లక్షలకు మరో వ్యక్తికి విక్రయించాడు. డీలర్ తనకు రావాల్సిన రూ.లక్షతోపాటు మిగతా రూ.1.70 లక్షలను కూడా తనవద్దే ఉంచుకున్నాడు. ఆరు నెలలుగా రఫీక్ డబ్బులు అడుగుతున్నా ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అటు ఇల్లు పోయి, ఇటు డబ్బులు పోయి రోడ్డునపడ్డాడు.