Double Bedroom house | నమస్తే తెలంగాణ నెట్వర్క్ : అగ్గిపెట్టె లాంటి ఇరుకు గదిలో ఓ పక్కన గ్యాస్ సిలిండర్, పొయ్యి, గిన్నెలు, నీళ్ల బిందెలు, డ్రమ్ములు.. ఒక దిక్కు మంచం, బట్టలు.. మరో పక్క పిల్లల పుస్తకాలు, ఆట బొమ్మలు, మరో దిక్కు టీవీ, కుర్చీలు ఇలా వాటి మధ్యనే కుటుంబమంతా ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఇక బంధుమిత్రులు వస్తే ఎక్కడుండాలి? ఊహించుకుంటేనే అమ్మో.. మా వల్ల కాదు అనిపిస్తుంది కదా!.. చాలీ చాలని ఆదాయంతో వేలాది మంది ఇలాంటి జీవితాలనే గడుపుతున్నారు. ఇది గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి బతుకుల్లో మార్పు తెచ్చేందుకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం లక్ష ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో ఇంటి పత్రాలు అందుకున్న లబ్ధిదారుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటామని, దేవుడితో పోల్చుతూ చేతులెత్తి మొక్కుతున్నారు.
సొంత ఇల్లు.. కలలో కూడా అనుకోలేదు
తమది పాలమూరు జిల్లాలోని ఐజ ప్రాంతమని, పెండ్లయిన కొన్నినెలలకే బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చామని జోగోల్ల మణెమ్మ తెలిపారు. 20 ఏండ్లుగా ఫిలింనగర్ మురికివాడలో ఇరుకు గది కిరాయికి ఉంటూ నానా కష్టాలు పడుతున్నామని చెప్పారు. తన భర్త వెంకటేశ్, తాను కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నామని వెల్లడించారు. కొడుకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తుండగా, కుమార్తె 7వ తరగతి చదువుతున్నదని వివరించారు. పిల్లల చదువుకే ఏటా రూ.60 వేల దాకా ఖర్చవుతున్నదని, తమ సంపాదన నెలకు రూ.20 వేలేనని వాపోయారు. చిన్న ఇల్లయినా కిరాయి మాత్రం నెలకు రూ.6 వేలు కట్టాల్సి వస్తున్నదని చెప్పారు. నెలలో సగం రోజులు మాత్రమే పని దొరకడంతో, మిగిలిన రోజుల్లో తిండి దొరకడమే గగనంగా ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు.
నెలాఖరులో ఇల్లు గడవడానికి అప్పులు చేయడం, వాటిని తిరిగిచెల్లించడంతోనే జీవితం మొత్తం సరిపోతున్నదని కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటేనే సొంత ఇల్లు సాధ్యమవుతుందని అనుకున్నామని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ తమకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడంతో ఆనందానికి అంతులేకుండా పోయిందని నవ్వులు చిందించారు. సొంతింటి గురించి కనీసం ఊహల్లో కూడా ఆలోచించలేదని, కొల్లూరులో కట్టిన ఇండ్లను చూస్తుంటే కడుపు నిండిపోయిందని మణెమ్మ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చినంకనే తమలాంటి పేదలకు ప్రభుత్వం ద్వారా సాయం అందుతున్నదని, వృద్ధులకు, వికలాంగులకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లతో వారంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కలలో కూడా ఊహించని బహుమతిని డబుల్ బెడ్రూం ఇంటి రూపంలో తమకు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటామని తెలిపారు.
అల్లా రూపంలో కేసీఆర్ ఆదుకున్నరు
భార్యాభర్తలం ఇద్దరం దినమంతా పనికి వెళ్లినా వచ్చిన ఆదాయంతో పిల్లలను సాకడమే కష్టమవుతున్నదని రాజేంద్రనగర్ నియోజకవర్గం సులేమాన్‌నగర్ డివిజన్‌కు చెందిన అడ్డా కూలి హర్షా సుల్తానా ఆవేదన వ్యక్తంచేశారు. గుడిసె వేసుకోవడానికి కొంత స్థలం దొరికితే చాలనుకున్నామని, కానీ సీఎం కేసీఆర్ సార్ తమకు మంచి ఇల్లు అందిస్తున్నారని తెలియగానే నమ్మలేదని, అది కల అనుకున్నామని ఆనందంతో కంట నీరు పెట్టారు. అల్లా రూపంలో సీఎం కేసీఆర్ ఆదుకున్నారని చెప్పారు. జీవితాంతం సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టంచేశారు. ఇంటి కోసం దరఖాస్తు చేసినా పైరవీ కారులకే వస్తుందని కాలనీలో చాలామంది హేళన చేశారని, కానీ ఇప్పుడు వారు దరఖాస్తు చేసుకోనందుకు బాధపడుతున్నారని హర్షా సుల్తానా వెల్లడించారు.
ఏదో సాధించినంత సంతోషం
ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు దేవుడని డబుల్ బెడ్రూం లబ్ధిదారులు హైదరాబాద్ శివారు జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన భవాని, శేఖర్ దంపతులు సంతోషం వ్యక్తంచేశారు. శేఖర్ ఆటో నడపడంతో వచ్చే ఆదాయంతోనే కుటుంబం గడవడం కష్టంగా ఉన్నదని భవాని పేర్కొన్నారు. రేకుల ఇంట్లో కిరాయికి ఉంటున్నామని, నెలకు రూ.15 వేలు సంపాదనలో కిరాయికి రూ.3,500, ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులకే సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అప్పులు చేయక తప్పదని వాపోయారు. కేసీఆర్ పుణ్యమా అంటూ పెండ్లి సమయంలో కల్యాణలక్ష్మి కింద తన పెండ్లికి రూ.51 వేలు.. పిల్లలు పుట్టినప్పుడు కేసీఆర్ కిట్లతోపాటు రూ.11 వేలు ఆర్థిక సాయం అందిందని వివరించారు. ప్రస్తుతం సొంతింటి కల కూడా నెరవేరిందని ఆనందం వ్యక్తంచేశారు. ఇక అద్దె కట్టడం తప్పుతుందని, ఏదో సాధించినంత సంతోషం కలుగుతున్నదని చెప్పారు. తమ లాంటి పేదలకు ఎంతో చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామని స్పష్టంచేశారు.
సీఎం కేసీఆర్ మీద మా నమ్మకమే గెలిచింది
తమ పెండ్లయి 18 ఏండ్లయిందని, తన భర్త కార్పెంటర్‌గా పనిచేస్తుండగా, తాను ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంట్లో వంటపని చేస్తుంటానని బంజారాహిల్స్ ఎన్బీటీనగర్ కుంటకు చెందిన సౌర్ల లత వెల్లడించారు. తమకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, పెండ్లయినప్పటినుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నామని చెప్పారు. తనకు నెలకు రూ.5 వేలు జీతం వస్తుండగా, తన భర్తకు అప్పుడప్పుడు మాత్రమే పని దొరుకుతుందని, ఇలా ఇద్దరికీ వచ్చే సుమారు రూ.12 వేల ఆదాయంలో రూ.4,500 ఇంటి కిరాయికే పోతుందని వివరించారు. పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత లేకపోవడంతో తెలంగాణ గురుకుల పాఠశాలలో చేర్పించామని చెప్పారు. పెద్దమ్మాయి ముత్తంగిలోని గురుకుల కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం, చిన్న పాప తూప్రాన్‌పేటలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని కేసీఆర్ మాటివ్వడంతో ఏదో రోజున తప్పక వస్తుందన్న నమ్మకంతో ఉన్నామని, కేసీఆర్ మాటిస్తే పక్కా తీరుస్తాడని నమ్మకం ఉన్నదని పేర్కొన్నారు. తమ నమ్మకాన్ని నిజం చేస్తూ ఒక్క రూపాయి కూడా ఖర్చులేకుండా ఫోన్ చేసి ఇల్లు ఇచ్చారని ఆనందం వ్యక్తంచేశారు.
అద్దింట్లోనే చనిపోతాననుకున్నా
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని శ్రీరాంనగర్‌లో 40 ఏండ్లు గా కిరాయి ఇంట్లోనే ఉంటున్నామని గడ్డమీద భాగ్యమ్మ చెప్పారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసే తన భర్త 20 ఏండ్ల క్రితమే గుండెపోటుతో చనిపోవడంతో పిల్లలను పోషించేందుకు స్క్రాప్ దుకాణం నడుపుతున్నట్టు వివరించారు. ఇంటి కిరాయి నెలకు రూ.3,500 కిరాయి చెల్లిస్తానని పేర్కొన్నారు. ఆడపిల్లల పెండ్లిళ్లు చేయగా, ముగ్గురు కొడుకులు ఎవరి దారినవారు వెళ్లిపోయారని, తనతో ఉన్న చిన్నకొడుకు పెండ్లయిన కొన్నేండ్లకే గుండెపోటుతో మృతి చెందినట్టు కన్నీటి పర్యంతమయ్యా రు. దీంతో ఒంటరైన తాను స్క్రాప్ దుకాణంతో వచ్చే సుమారు రూ.10 వేలతోనే బతుకుబండిని లాగుతున్నానని చెప్పారు. అద్దె ఇంట్లోనే చనిపోతానేమోనని అనుకునేదాన్నని ఆవేదన వ్యక్తంచేశారు. కొడుకులు కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి భారం కాకూడదనే ఆరోగ్యం సహకరించకున్నా స్క్రాప్ దుకాణం నడుపుతున్నానని తెలిపారు. తన పరిస్థితిని చూసి బస్తీ నాయకులు తనతో డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేయించారని, సీఎం కేసీఆర్ దయతో ఇల్లు వచ్చిందని చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు సీఎం కేసీఆర్ పెద్దన్నలాగా ఇంటిని బహుమతి ఇచ్చారని చేతులెత్తి మొక్కారు. కేసీఆర్ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని పేర్కొన్నారు.
విధి వెక్కిరించినా కేసీఆర్ ఆదుకున్నడు
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త చనిపోయాడని, విధి వెక్కిరించడంతో జీవి తం వృథా అనిపించిందని ఫిలింనగర్‌కు చెందిన బొమ్మా లక్ష్మీబాయి కన్నీరు పెట్టుకున్నారు. పిల్లలను చదివించాలన్న ఒకే ఒక్క పట్టుదలతో ఇండ్లల్లో పనిచేస్తూ జీవిస్తున్నానని చెప్పారు. పాప ఎంసీఏ చదువుతున్నదని, తనకు ఆరోగ్యం సరిగాలేకపోవడంతో రెండేండ్లుగా పనికి వెళ్లలేకపోతున్నానని, దాంతో తన కొడుకు ఇంటర్ పూర్తిచేసిన తర్వాత ప్రైవేటు దవాఖానలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపింది. కొడుకుకు వచ్చే రూ.15 వేల జీతం మీదే కుటుంబం ఆధారపడి ఉన్నదని చెప్పారు. రూ.6 వేలు కిరాయికే పోతుందని వెల్లడించారు. సొంత ఇల్లు కట్టుకోవడం అసాధ్యమే అని అనుకునేదాన్నని ఆవేదన చెందారు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పడంతో ఆయనపై నమ్మకంతో దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఇల్లు వస్తుందన్న ఆశతో ఉన్న తనకు రాఖీ పండుగనాడు ఫోన్ కాల్ వచ్చిందని, ఇల్లు రావడంతో కొల్లూరుకు పోయి పత్రాలు తెచ్చుకున్నామని సంతోషం వ్యక్తంచేశారు. విధి వెక్కిరించినా కేసీఆర్ సార్ దయతో తన తలరాత మారిందని, ముఖ్యమంత్రి సార్ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు.