హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలు కల్పించే దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ ఏడాది సైతం మూడు విడతల్లో సీట్లను భర్తీ చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 969 కాలేజీలుండగా 4,40,107 సీట్లున్నాయి. మొదటి విడత రిజిస్ట్రేషన్ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. మూడో విడత సీట్లను జూన్ 20న కేటాయిస్తారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి.