దంతాలపల్లి, సెప్టెంబర్ 3 : ఇందిరమ్మ ఇంటి నిర్మాణం బేస్మెంట్ లెవల్ పూర్తయి రెండు నెలలవుతున్నా బిల్లు రాకపోవడంతో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఓ లబ్ధిదారు కుటుంబ సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయించారు. దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన బోతమల్ల స్వరూపకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మంజూరు పత్రాన్ని అందజేశారు.
అనంతరం అధికారులు ఇంటికి వచ్చి నిర్మాణం చేపట్టాలని తెలుపడంతో పెంకుటిల్లును కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణానికి బేస్మెంట్ పూర్తిచేశారు. రెండు నెలలవుతున్నా బిల్లు రాకపోవడంతో లబ్ధిదారు కుటుంబ సభ్యులు బుధవారం దంతాలపల్లిలో రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎంపీడీవో విజయ, పోలీసులు అక్కడికి వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.