దంతాలపల్లి, ఏప్రిల్ 30: డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ ఓ కాంగ్రెస్ కార్యకర్త చెంప ఛెల్లుమనిపించారు. సదరు ఎమ్మెల్యే పర్యటన సమాచారం ఇవ్వలేదన్నందుకు కోపంతో ఊగిపోయి అందరి ముందు ఆ కార్యకర్తపై చేయిచేసుకోవడంతో సమావేశానికి వచ్చినవారంతా నిశ్చేష్టులయ్యారు. ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ మంగళవారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లిలో పర్యటించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలోని ఓ కూడలిలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు చెప్పేందుకు వేదిక వద్దకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్త గుమ్మడవెళ్లి శ్రీకాంత్.. ‘మీరు గ్రామానికి వచ్చే సమాచారం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాకు చెప్పడం లేదు సార్ అనడంతో.. కూర్చో తర్వాత మాట్లాడుదాం’ అని ఎమ్మెల్యే సముదాయించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేసిన తమకు.. కనీసం సమాచారం ఇవ్వడం లేదని శ్రీకాంత్ ఎమ్మెల్యేకు పదే పదే చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న గ్రామ అధ్యక్షుడికి, శ్రీకాంత్‌కు మధ్య గొడవ జరిగింది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే.. ‘మీ మధ్య పర్సనల్ గొడవ ఉంటే మీరు మీరు చూసుకోండి.. తాగొచ్చి ఇక్కడ గొడవ చేస్తే పండ్లు రాలుతాయి.
తమాషా చేస్తున్నావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా శ్రీకాంత్ వినకుండా.. ‘మీరు వచ్చే సమాచారం మాకెందుకు ఇవ్వరు?’ అని అడగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. అందరూ చూస్తుండగానే శ్రీకాంత్ చెంపపై గట్టిగా కొట్టారు. దీంతో అక్కడున్న కార్యకర్తలు నిశ్చేష్టులైపోయారు. సమావేశం అనంతరం శ్రీకాంత్‌ను ఎమ్మెల్యే తన కారులో కూర్చోబెట్టుకొని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.