Mahabubabad | మహబూబాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : తిందామంటే తిండి లేదు.. కట్టుకుందామంటే బట్టలేదు.. ఇంట్లో ఉందామంటే మొత్తం బురదే.. ఇది దుబ్బతండా వాసుల దుస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆకేరు వాగు వరద ముంచెత్తడంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతండా తీవ్రంగా నష్టపోయింది. పంటలతోపాటు గొడ్డుగోదా కొట్టుకుపోగా, ఇంట్లో ఉన్న బియ్యం, ఉప్పు, పప్పు, ఇతర నిత్యావసరాలు, దుస్తులు తడిసి ముద్దయ్యాయి. సర్వస్వం కోల్పోయిన ఆ తండావాసులకు చివరికి మిగిలింది దుబ్బే. దుబ్బతండాలో 50 ఇండ్లు ఉండగా, సుమారు 200 మంది నివసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి సృష్టించిన వరద బీభత్సంతో తండా రూపురేఖలు లేకుండా పోయింది.
తెల్లవారుజామున 4 గంటలకు ఇళ్లల్లోకి వరద వస్తుండటంతో గమనించిన ప్రజలు ఉత్త చేతులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పకనే ఉన్న చిలుకోయపాడు గ్రామానికి వెళ్లి తలదాచుకున్నారు. మూడు రోజుల తర్వాత తండాకు వచ్చిన ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఇళ్లను శుభ్రపరచుకుంటున్నారు. ఓ రైతుకు చెందిన 30 బస్తాల జొన్నలు వరదలో కొట్టుకుపోగా, కొందరు రైతుల వరి, మిర్చి, పత్తి నీట మునిగింది. మరి కొంతమంది పంటలతోపాటు మోటర్లు, మీటర్లు వరదలో కొట్టుకుపోయాయి. రెండు ఇండ్లు పూర్తిగా కూలిపోగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. తండా అంతా బురదతో నిండిపోయి దుర్వాసన వస్తుండటంతో అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొన్నది.
సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారే తప్ప ఇప్పటివరకు దుబ్బతండా వాసులను పలుకరించినవారే లేకుండా పోయారు. తాము పంటల కోసం పెట్టిన పెట్టుబడిని ప్రభుత్వం నష్టపరిహారంగా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే తండాకు చెందిన ధరావత్ రాజమ్మ మనుమరాలికి పెండ్లి కుదరగా అకస్మాత్తుగా వచ్చిన వరద ఆమె ఇల్లును గుల్ల చేసింది.
పెండ్లి కోసం రూ.లక్ష వెచ్చించి కొనుగోలు చేసిన 5 క్వింటాళ్ల బియ్యం, ఇతర సామగ్రి కొట్టుకుపోవడంతో రాజమ్మ లబోదిబోమంటున్నది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల, మరిపెడ మండలం సీతారాంతండా, డోర్నకల్ మండలం దుబ్బతండాల్లో పరిస్థితి ఇంకా అలానే ఉన్నది. ఆయా తండాల్లోని ప్రజలు తడిసిన నిత్యావసరాలను ఇంటి ముందు ఆరబెట్టుకుంటున్నారు. ఇంట్లో చేరిన బురదను శుభ్రం చేసుకుంటున్నారు. తమ కుటుంబాలను ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
రావిరాల గ్రామంలో గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ పర్యటించి 110 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం వరద బాధితుల కోసం నిధులు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇవ్వకపోవడం బాధాకరమని ఆరోపించారు. సీతారాం తండాలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పర్యటించి 56 కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు అందజేశారు. అధికారులు అరకొరగా పారిశుద్ధ్య పనులు చేస్తుండటంతో దుర్వాసన పోవడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మహబూబాబాద్ మండలం అయోధ్య తదితర గ్రామాల్లో తెగిన చెరువులను బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు పరిశీలించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం మెడలు వంచైనా రైతులందరికీ నష్టపరిహారం ఇప్పించే వరకు తమ పోరాటం ఆగదని భరోసా కల్పించారు.