హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): బురద అంటే.. అదో బురద. పోయి పోయి ఒంటికి రాసుకుంటామా? అనుకుంటాం. కానీ, ఆ బురద బంగారం అంటున్నారు సుఫల ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ దొరయ్య. బురదను సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవచ్చని చెప్తున్న ఆయన.. దాన్ని వెలికితీసే సాంకేతికతను అభివృద్ధి చేసి, పేటెంట్లు కూడా సాధించారు. ఒకప్పుడు సాధారణ రైస్‌మిల్లర్ అయిన ఆయన.. ఇంజినీరింగ్ నైపుణ్యాలను జోడించి మురుగునీటి నిర్వహణకు అవసరమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు.
చెరువులు, కుంటలు, జలాశయాల్లో భారీగా పేరుకుపోయిన పూడికను చాలా తేలికగా తీసే విధానాన్ని దొరయ్య డెవలప్ చేశారు. తక్కువ విద్యుత్తు వినియోగం, అతి తక్కువ మానవ వనరులతోనే మట్టిని తొలగించొచ్చు. ఈ సాంకేతికత పేరు ‘విండ్ మిల్ పవర్డ్ వాటర్ లిఫ్టింగ్ మెకానిజం’. ఈ పద్ధతి పాతకాలంలో బకెట్లను ఉపయోగించి నీటి తోడే విధానం తరహాలోనే ఉంటుంది. కరెంట్ అందుబాటులో లేని కాలంలో బకెట్లను ఉపయోగించి రాట్నం తిప్పుతూ నీటిని తోడే విధానాన్ని ఆధునీకరించి, నీటి అడుగున పేరుకుపోయిన పూడిక తీసేలా డిజైన్ చేశారు. 15-20 అడుగుల ఎత్తులో ఉండే భారీ టవర్లకు బకెట్లను బిగించి, ఆ టవర్లకు కరెంట్ సరఫరా చేయడం వలన తిరుగుతుంది. ఈ సమయంలో నీటి అడుగు భాగంలో అధిక పీడనం కలుగజేస్తే పూడిక పైకి లేచి బకెట్లలోకి చేరుతుంది.
ఈ టెక్నాలజీ సాయంతో టన్ను మట్టిని బయటకు తీసేందుకు రూ. 2,500 మాత్రమే ఖర్చు అవుతుందని, సాధారణ పద్ధతిలో బయటకు తీయాలంటే రూ.15-20 వేల ఖర్చు వస్తుందని చెప్తున్నారాయన. ఆ పూడికలో కంపోస్ట్ ఎరువు తరహాలో సేంద్రియ గుణాలు ఉంటాయని, కొంత ప్రాసెస్ చేసి వాడుకోవచ్చని తెలిపారు. ఆ మట్టిని సేంద్రీయ ఎరువుగా ప్రాసెస్ చేసి విక్రయించటం వల్ల ఎరువుల భారం తగ్గడంతోపాటు, రూఫ్ గార్డెన్, ఇంటీరియల్ గార్డెనింగ్‌తో సేంద్రియ ఎరువుల డిమాండ్ తగ్గుతుందని, దీన్ని విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.50 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని వివరించారు. పూడిక తీసిన మట్టితో ఇటుకలు తయారుచేస్తే నిర్మాణరంగానికి అవసరమైన ఇటుకల ఖరీదు భారం తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం ఒక్క ఎర్ర ఇటుక తయారీకి రూ.3-5 ఖర్చు అవుతుండగా, పూడిక మట్టిని వినియోగిస్తే 60-80 పైసలే ఖర్చు అవుతుందని, ఒక్కో ఇటుకను రూ.3-5కే విక్రయించే వీలు ఉంటుందని వెల్లడించారు.
జాతీయ స్థాయిలో తన టెక్నాలజీకి పేటెంట్ ఉన్నా వీటిని అమలు చేయడం విషయంలో ఇప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని దొరయ్య అంటున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక అధికారులు, ప్రజాప్రతినిధులకు తన ప్రాజెక్టు గురించి వివరించానని తెలిపారు. మంత్రులు, ముఖ్యమంత్రుల కార్యాలయాల నుంచి స్పందన వస్తున్నా, క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోవటం లేదని వాపోయారు. గత ఏడాది కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి వివరించానని, పైలట్ ప్రాజెక్టులో ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అనుమతించారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఆసక్తి చూపినా.. హెచ్ఎండీఏ, వాటర్‌బోర్డు అధికారులు ఆసక్తి చూపటం లేదని పేర్కొన్నారు.