హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనం కోసం రైతులను బలి పెట్టాలని చూడటం అప్రజాస్వామికమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులపై రేవంత్రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఆ పార్టీ ఖండించింది. లగచర్ల రైతులపై పోలీస్ నిర్బంధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. భూములు ఇచ్చేది లేదన్న లగచర్ల రైతులను కుట్రదారులుగా పేరొంటూ అరెస్ట్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. అధికారులపై దాడులు చేశారనే నెపంతో ఊరుపైనే నిర్బంంధం కొనసాగించడం అక్రమమని చెప్పారు. విలువైన భూములు కోల్పోయి.. నిర్వాసితులం అవుతామన్న ఆవేదనతోనే అధికారులపై రైతులు దాడి చేశారని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు సేవలందించే ఉద్యోగులపై కొందరు రాజకీయ లబ్ధి కోసం భౌతికదాడులకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు విమర్శించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగులపై దాడికి నిరసనగా జేఏసీ, ట్రెసా పిలుపు మేరకు గురువారం కోఠిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దాడికి పాల్పడినవారితోపాటు తెరవెనుక ఉండి రెచ్చగొట్టినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు.