ముషీరాబాద్, డిసెంబర్ 10 : చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగాలని పలువురు ఎంపీలు పిలుపునిచ్చారు. బీసీల హక్కులపై బుధవారం ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బీద మస్తాన్‌రావు, పాక సత్యనారాయణ, నాగరాజు పాల్గొని ప్రసంగించారు. కులగణన లెక్కలు వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయరంగాల్లో వాటా లభిస్తుందని, ఆ దిశగా వాటా సాధించేవరకు విశ్రమించ కూడదని పేర్కొన్నారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని, రూ.2లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రవేశపెట్టాలని కోరారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 25నుంచి 50శాతానికి పెంచాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాం డ్ చేశారు. సదస్సులో బీసీ సంఘం నాయకులు వకుళాభరణం కృష్ణమోహన్, డాక్టర్ ర్యాగ అరుణ్‌కుమార్, అజయ్‌కుమార్, నీ ల వెంకటేశ్, గంగాపురం పద్మ, అనురాధ, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.