నిర్మల్, జూలై 11 : జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వరుసగా మూడో రోజు విస్తృతంగా పర్యటించారు. జోరు వానను సైతం లెక్క చేకుండా వాగులు, వంకలు దాటుతూ.. బురదలోనే సోమవారం పరిమండల్, కిషన్ రావు పేట్ ముంపు గ్రామాల్లో పర్యటించారు.
కిషన్ రావు పేటలో గండిపడిన చెరువును పరిశీలించారు. ముంపునకు గురైన ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే వారికి భరోసా కల్పించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పోలాలను పరిశీలించారు. రైతుల పరిస్థితిని నేరుగా తెలుసుకున్న మంత్రి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
జిల్లాలో సగటున 22 సెంటిమీటర్ల భారీ వర్షం కురవడం వల్ల ఈ ప్రాంతమంతా అతలాకుతలమైందన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు అన్నీ నిండుకుండలా మారాయన్నారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ముశ్రప్ అలీ ఫారూఖీ, తదితరులు ఉన్నారు.