హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాజముద్ర రూపకల్పనలో చరిత్రకారుల మేధోమథనం ఉన్నదని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్టాక్) కో కన్వీనర్ అనురాధారెడ్డి వివరించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల విషయంపై ఆమె స్పందిస్తూ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. సుదీర్ఘ చర్చలు, అంతకుమించిన వారసత్వ నేపథ్య మూలాలు, సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఉర్దూ యూనివర్సిటీ, ఉస్మానియా వర్సిటీ, చరిత్రకారుల బృందం కలిసి ఎన్నో సలహాలు, సూచనలు తీసుకొని రాజచిహ్నాన్ని తయారు చేశారని, అలా రూపొందించినదాన్నే ఇన్నాళ్లూ అధికారికంగా వినియోగించామని వెల్లడించారు. కాకతీయ తోరణం, చార్మినార్ అనేవి రాచరిక, మతపరమైన అంశాలు కానే కావని, వాటి నేపథ్యం వేరే ఉన్నదని చెప్పారు. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయుల వీరత్వం, ఇక్కడి కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళాతోరణం, రామప్ప ఆలయాన్ని నిర్మించారని, చారిత్రక చార్మినార్ మతపర కట్టడం కాదని, దానికి దక్కన్ వారసత్వ మూలాలున్నాయన్నారు. ఎంతో మందిని బలిగొన్న ప్లేగు వ్యాధిపై సాధించిన విజయానికి ప్రతీకగా చార్మినార్ను జ్యామితీయ విధానంలో నిర్మించారని వివరించారు. సాంస్కృతిక, వారసత్వ, చారిత్రక అంశాలపై నిర్ణయం తీసుకునేటప్పుడు చరిత్రకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. నిజానికి రాజముద్రలో మార్పు అంటే అస్తిత్వాన్ని చాటే చారిత్రక ఆనవాళ్లను చెరిపివేసేలా ఉండకూడదని చెప్పారు.