జూలూరుపాడు, సెప్టెంబర్ 1 : పురుగుల అన్నం, నీళ్ల చారుతో వడ్డిస్తున్న భోజనం తమకొద్దంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు జడ్పీ హైస్కూల్ ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. అన్నం ప్లేట్లతో రోడ్లుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. మెనూ పాటించకుండా రోజూ పురుగుల అన్నం, నీళ్ల చారుతో భోజనం పెడుతున్నారని, ఎన్నిసార్లు చెప్పినా కూరలు వండటం లేదని ఆరోపించారు.
మధ్యాహ్న భోజన కార్మికులను వెంటనే తొలగించి నాణ్యమైన భోజన అందించాలని డిమాండ్ చేశారు. హెచ్ఎం లక్ష్మీనర్సయ్య వచ్చి మెనూ ప్రకారం భోజనం వడ్డించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.