నయీంనగర్, ఆగస్టు 25: హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో సామాన్యుల ఇండ్లు కూలగొట్టడం సరికాదని, దశాబ్దాల నుంచి నివసిస్తున్న వారికి అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేల పదవిని తక్షణమే రద్దు చేసే విధానం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిత్రపురికాలనీలో అక్రమ నిర్మాణాలకు నోటీసులు
మణికొండ, ఆగస్టు 25: మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు నిర్మాణ అనుమతులులేవని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ ఆదివారం నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం జారీ చేసిన జీవో నంబర్ 658(రెవెన్యూ)కు తూట్లు పొడుస్తూ 225 రో హౌజ్‌ల నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. గత సొసైటీ పాలకవర్గం జీప్లస్1 అనుమతులు పొంది జీప్లస్2 నిర్మాణాలు చేసిందని, 15 రోజుల్లో నోటీసులకు జవాబు ఇవ్వాలని కమిషనర్ తెలిపారు. జవాబు లేనిపక్షంలో కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు.