న్యూఢిల్లీ, జూలై 3: వ్యవస్థాగత సమస్యల కారణంగా 18 ఏండ్లు పైబడిన మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరూ ఓటర్ల జాబితాలో నుండి తొలగిపోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయెన్స్(ఏఎల్ఐఎఫ్ఏ-ఎన్ఏపీఎం) విజ్ఞప్తి చేసింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో మహిళల ఓటు హక్కులు క్రమబద్ధంగా నిర్వీర్యం కావడం, భారీ స్థాయిలో తగ్గిపోవడం పట్ల ఈసీఐకి రాసిన లేఖలో సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో లేకుండా పోకూడదు అనే తన ప్రధాన లక్ష్యానికి ఈసీఐ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సంస్థ పేర్కొంది. 13 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగిన ‘సర్’ ప్రక్రియలోని మొదటి రెండు దశలకు సంబంధించిన ఈసీఐ గణాంకాలు, సవరించిన ‘సర్’ జాబితాలను బట్టి జీవిస్తున్న ఓటర్లలో 8.9 శాతం మందికి వాటిలో చోటు దక్కలేదని తెలిపింది. జనాభాలో వారి నిష్పత్తి కంటే మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, మైనారిటీ వర్గాలకు చెందిన సభ్యులు ముఖ్యంగా ముస్లిం వర్గాలు అధిక శాతంలో తొలగింపునకు గురయ్యాయని పేర్కొంది. బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ర్టాల్లో సర్ సవరించిన ఓటర్ల జాబితా కారణంగా లింగ నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల నమోదైందని తెలిపింది. అట్టడుగు వర్గాలు, మైనారిటీ వర్గాలు, బలహీన వర్గాలకు చెందిన మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగింపును తగ్గించడానికి కొన్ని చర్యలను సంస్థ ఈసీఐకి సూచించింది.
ఓటర్ అర్హత ప్రాతిపదికను విస్తరించాలి
దళితులు, ఆదివాసులు, డీనోటిఫైడ్, సంచార జాతులు, నిరాశ్రయ మహిళలు, ఆశ్రయాలలో ఉన్న మహిళలు, బస్తీలలో ఉన్న మహిళలు, సెక్స్ వర్కర్లు, వికలాంగులు, వృద్ధ మహిళలు, వితంతువులు, గృహ హింస బాధితులు, ఒంటరి మహిళలు, వర్ణాంతర వివాహాలలో ఉన్న మహిళలు, కుటుంబాలకు దూరమైన ట్రాన్స్జెండర్ వ్యక్తులు తదితర బలహీన వర్గాలకు చెందిన మహిళలు పత్రాలు పొందడంలో అదనపు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సంస్థ తెలిపింది. అందువల్ల వ్యక్తిగత మహిళా ఓటర్లను రుజువుల కోసం నానా తంటాలు పడేలా ఒత్తడి చేసే బదులు వలస, నిరాశ్రయులు, సంచార జాతుల కోసం ఈసీఐ ప్రత్యామ్నాయ పత్రాల మార్గాలను, విధానాలను నిర్దేశించాలని సంస్థ కోరింది. వివాహం తర్వాత వేరే ప్రాంతానికి వలస వెళ్లే మహిళలకు, తమ పుట్టింటి వారితో సంబంధాలు తెగిపోయిన ట్రాన్స్జెండర్ వ్యక్తులకు అవసరమైన పత్రాలను సమకూర్చుకోవడం అత్యంత కష్టమైన పనిగా సంస్థ వివరించింది.
ట్రాన్స్జెండర్ల సమస్యలు
ట్రాన్స్జెండర్, లింగ-వైవిధ్యం కలిగిన, సాంప్రదాయ లింగ నిర్వచనాలకు లోబడని వ్యక్తుల పేర్లు, లింగ వివరాలలో ఉండే వ్యత్యాసాలను ఈసీఐ గుర్తించాలని సంస్థ కోరింది. అనేకమంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు వలస వచ్చినవారు కావడం వల్ల తమ కొత్త నివాస ప్రాంతాల్లో వారికి నివాస ధ్రువీకరణ పత్రాలు ఉండవని, వారిని ఓటర్లుగా నమోదు చేయడానికి వ్యవస్థాగతమైన కృషి జరుగాలని సంస్థ కోరింది. 2014 ఏప్రిల్లో సుప్రీంకోర్టు నల్సా తీర్పు వెలువడిన తర్వాతే చాలా మంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఓటర్ల జాబితాలో ప్రవేశించారని సంస్థ పేర్కొంది. వీరిలో చాలామంది తమ కుటుంబాలకు, సొంత ఊళ్లకు దూరమయ్యారని, వారి పేర్లు, లింగ వివరాలకు సంబంధించిన పత్రాల మధ్య పొంతన ఉండకపోవచ్చని సంస్థ పేర్కొంది. వీరి ఫొటోలు లేదా పత్రాలను తప్పుడుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, దీనివల్ల వీరి తప్పేమీ లేకపోయినా వీరు పేర్లు జాబితాల నుండి తొలగింపునకు గురికావచ్చని సంస్థ తెలిపింది. ఒకవేళ అందుబాటులో ఉన్నట్లయితే గెజిట్ నోటిఫికేషన్, ట్రాన్స్జెండర్ గుర్తింపు కార్డులు లేదా ధృవీకరణ పత్రాలను డాక్యుమెంటరీ ఆధారాలుగా పరిగణించాలని సంస్థ కోరింది.
ఈసీఐ వివరణ ఇవ్వాలి
‘సర్’ప్రకియ, పౌరసత్వ హోదా మధ్య ఉన్న సంబంధంపై ఓటర్లలో నెలకొన్న గందరగోళాన్ని, భయాన్ని ఈసీఐ తక్షణమే తొలగించాలని సంస్థ కోరింది. ఈసీఐ అధికార పరిమితిని సుప్రీంకోర్టు కేవలం ఓటర్ల జాబితా సవరణకు మాత్రమే పరిమితం చేసిందని, సవరించిన సర్ నుండి మినహాయించడం పౌరసత్వ హోదాను నిరాకరించడం కాదని స్పష్టంగా పేర్కొంటూ ఈసీఐ ఒక అధికారిక ప్రకటనను జారీచేయాలని సంస్థ సూచించింది.
అర్హులైన అందరికీ ఓట్లు
అర్హులైన మహిళా ఓటర్లు, ట్రాన్స్జెండర్ ఓటర్లందరినీ సవరించిన ‘సర్’ జాబితాలోకి తిరిగి తీసుకువచ్చేలా, ఏ మహిళ లేదా ట్రాన్స్జెండర్ వ్యక్తి ఓటు హక్కును కోల్పోకుండా ఉండేలా ఈసీఐ తప్పనిసరిగా చూడాలని సంస్థ కోరింది. ‘సర్’ ప్రక్రియలోని అన్ని దశల్లో మహిళలు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల కోసం ఈసీఐ ప్రత్యేక లింగ స్నేహపూర్వక డెస్క్లను ఏర్పాటు చేయాలని సంస్థ సూచించింది. మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, వలస కార్మికులు, గృహ హింస బాధితులు మొదలైన వారికి వంశపారంపర్య గుర్తింపు, ప్రత్యామ్నాయ నిర్దేశిత పత్రాల విషయంలో సహాయపడేందుకు ఈఆర్వో/ఏఈఆర్వో కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, సులభంగా చేరుకోగల స్థానిక కేంద్రాల్లో నిష్పక్షపాత, స్వతంత్ర సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంస్థ కోరింది.
కాలపరిమితి పొడిగించాలి
‘సర్’ ప్రక్రియను పూర్తి చేయడానికి కేటాయించిన సమయాన్ని ఈసీఐ వెంటనే పెంచాలని సంస్థ కోరింది. ‘సర్’ ప్రక్రియలోని ప్రతి దశలోనూ అర్హులైన వారిని తొలగించడానికి, తప్పులు దొర్లడానికి ఈ తక్కువ సమయ పరిమితులే ప్రధాన కారణమని పేర్కొంది. బీఎల్వోలు తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయడానికి తగిన సమయం అవసరమని, అలాగే ఓటరుకు ముఖ్యంగా మహిళా ఓటర్లు కూడా తగిన సమయం అవసరమని సంస్థ సూచించింది.