భువనగిరి అర్బన్, అక్టోబర్ 24: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం మాదిగ కులస్థులైన వంగపల్లి రామయ్య, చెరుకు మొగులయ్య, నవీన్‌కు చెందిన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతుందని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం వారు బాధితులతో కలిసి భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. మోటకొండూర్ భూముల వ్యవహారం కొంతకాలంగా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కొందరు అధికారుల మద్దతుతో సంబంధిత కుటుంబాలను మనోవేదనకు గురిచేస్తున్నారని తెలిపారు.
ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా చెరుకు మొగులయ్య, నవీన్‌కు చెందిన 1.10 ఎకరాల లావణి పట్టా భూమిని కురుమ కులానికి చెందిన బండి నర్సమ్మ తనదని పేర్కొంటూ తహసీల్దార్ కార్యాలయానికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రోత్సాహం ఉన్నదని వారు విమర్శించారు. ఈ విషయమై ఆర్డీవో చొరవ తీసుకొని ఏడీ ద్వారా సర్వే చేయించి తగిన న్యాయం చేయాలని కోరారు. కానీ స్థానిక ఎమ్మెల్యే సైతం ఓ కులానికి మాత్రమే న్యాయం చేస్తూ బడుగుబలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.