మహబూబ్‌నగర్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల పనితీరు బాగాలేదని.. సాక్షాత్తు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఎదుట అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. పేదలు దవాఖానకు వస్తే వెంటనే హైదరాబాద్‌కు తీసుకుపోండని పంపిస్తున్నారని.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఇన్చార్జి మంత్రి దృష్టికి తెచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి దామోదర రాజనర్సింహ, మరో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తమ ప్రాంతానికి చెందిన రోగులు వస్తే పట్టించుకోకుండా రాజధానికి రెఫర్ చేస్తున్నారని వివరించారు. ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడి పంపుతుండటంతో వాహన డ్రైవర్లు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లకుండా నేరుగా అమీర్‌పేట్‌లోని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లి అడ్మిట్ చేసి చేతులు దులుపుకొంటున్నారని ఫిర్యాదు చేశారు. మరో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ నారాయణపేటలో జిల్లా దవాఖాన ఉన్నా అక్కడకు వచ్చే రోగులను మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేస్తున్నారని తెలిపారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇది నిజమేనని.. ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాల్సిన పేషంట్లను కమీషన్లకు కక్కుర్తిపడి ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్తున్నారని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ పనితీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రి దృష్టికి తీసుకెళ్తే చర్యలు తీసుకుంటామని కానీ.. ఇలా చేయొద్దని కానీ.. అధికారులకు ఆదేశాలు జారీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.