KTR | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): అన్నిరంగాల్లో వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకు బీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి సర్కారు భారీ కుట్రలకు తెరలేపిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజాక్షేమమే బీఆర్ఎస్ శ్రేణుల లక్ష్యమని స్పష్టం చేశారు. అడుగడుగునా సర్కారు తప్పిదాలను, సీఎం రేవంత్‌రెడ్డి అవినీతిని ఎత్తిచూపుతున్నందుకు గులాబీ శ్రేణులపై ప్రభుత్వం తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నదని, ఆ నైరాశ్యంతోనే రాజకీయ వేధింపులకు దిగుతున్నదని చెప్పారు. సర్కారు వేధింపులు, బెదిరింపులను లెక్కచేయకుండా మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్లకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా బీఆర్ఎస్పై జరిగిన పరిణామాలు ప్రారంభమేనని, రానున్న రోజుల్లో వాటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ చేసే వ్యక్తిగత దాడులు, కుట్రలు, విష ప్రచారాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ కుట్రపూరితంగా డీప్ ఫేక్ టెక్నాలజీ సహా ఇతరాల సహకారంతో ఆ పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్‌లతో చేసే దుర్మార్గాలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వారి పెయిడ్ సోషల్ మీడియా అంతా కలిసి మూకుమ్మడిగా బీఆర్ఎస్ను టార్గెట్ చేయబోతున్నాయని చెప్పారు. అలాంటి కుటిల ప్రయత్నాలతో అయోమయానికి గురికావొద్దని, ఆగం కావాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ప్రజల పక్షాన నిలబడాలన్న పట్టుదలను బీఆర్ఎస్ విరమించుకుంటుందనేది కాంగ్రెస్ సర్కార్ కుటిల యత్నమని, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటం నుంచి పకకు తప్పుకోవద్దని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న పోరాటం నుంచి తమ దృష్టిని, మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అవినీతిని, అసమర్థతను ఎత్తిచూపుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, అందులో భాగమైన 420 హామీల అమలు కోసం ఒత్తిడి చేస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.