హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ‘ఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్’ ప్రోగ్రాం అమలులో అలసత్వం వద్దని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్క్రీనింగ్‌లో మహిళలకు అనారోగ్య సమస్యలు ఉంటే తక్షణమే చికిత్స ప్రారంభించాలని సూచించారు. స్క్రీనింగ్ జరిగే అన్ని దవాఖానలు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో అవసరమైన మేర సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, దవాఖానల సూపరింటెంట్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.