కురవి, ఏప్రిల్ 9 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణకు ఓ గిరిజన వృద్ధురాలు విరాళం అందజేసింది. తన వృద్ధాప్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఆసరాగా నిలిచారని, సభ ఖర్చులకు తన పెన్షన్ డబ్బు రూ. వెయ్యిని అందజేసి పెద్ద మనసు చాటుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కురవిలో చోటుచేసుకున్నది. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత బుధవారం మండల కేంద్రంలో రజతోత్సవ సన్నాహక సభ నిర్వహించారు. తుల్స్యా తండాపరిధిలోని కీమ్యాతండాకు చెందిన బోడ బాజీ రెండు ఐదువందల నోట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలి చేతిలో పెట్టింది. ‘భేటీ..మారి పింఛను దీ హాజరు ఆయే దేయాంతి…హజార్ రూపియా మార్ మోటే భేటా కేసీఆర్‌దే’(బిడ్డా.. నాకు రూ. రెండు వేల పింఛన్ వచ్చింది. రూ.వెయ్యి నా పెద్ద కొడుకు కేసీఆర్‌కు ఇస్తున్న) అని చెప్పింది.