Revanth Reddy | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): దొమ్మర సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను ఊరూరా ఊరేగిస్తూ చెప్పుదెబ్బలతో నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర దొమ్మరుల సంఘం, తెలంగాణ సంచార జాతుల సంఘం నిర్ణయించాయి. రేవంత్.. ‘రెడ్డి’ కుల దురహంకారంతో మదమెకిన ఆంబోతులా వ్యవహరిస్తున్నారని దొమ్మరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరే రాములు సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను 24 గంటల్లోగా వెనకితీసుకొని, దొమ్మర సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దొమ్మరులతో రేవంత్‌రెడ్డికి చెప్పు దెబ్బలతో సమాధానం చెబుతామని హెచ్చరించారు. దొమ్మర గంతులు వేయ డం, దొమ్మర గుడిసెలు దూరడం వంటి పదాలను పరిపాటిగా వాడుతూ తమ కులాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సంచార జాతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నాయని అన్నారు.