Padi Kaushik Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ సీఎం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్మించిన నిర్మాణాలకు రేవంత్ రెడ్డి రిబ్బన్లు కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయన కట్టిన నిర్మాణాలనే ప్రారంభిస్తున్నారని విమర్శించారు.
కరీంనగర్ కలెక్టరేట్ కేసీఆర్ ఆనవాళ్లు కాదా..? అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభకు ప్రజల నుంచి స్పందనే లేదని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన ఓ సవాల్ విసిరారు. సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అభివృద్ధిలో కనీసం 10 శాతం అయినా తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో చేసి చూపించాలని అన్నారు. ముఖ్యమంత్రి సొంత గ్రామంలోనే కరెంట్ సరఫరా సరిగా లేదని ఎద్దేవాచేశారు.
తెలంగాణలో తెలంగాణ తల్లిని కాదని కాంగ్రెస్ తల్లిని నిలబెట్టారని విమర్శించారు. రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. అప్పుడు కాంగ్రెస్ తల్లిని ప్యాక్ చేసి గాంధీ భవన్కు పంపుతామని కౌశిక్ రెడ్డి చెప్పారు.