నిన్నటి దాకా కంచ గచ్చిబౌలి స్క్రబ్ అడవిలో భయం లేకుండా బతికిన మూగజీవాలు ఆవాసం కోల్పోయి.. అటు తాగునీటి కొరత.. ఇటు నీడ నిచ్చే చెట్ల కూల్చివేత.. ఈ పరిస్థితుల్లో గూడు చెదిరి విశ్వవిద్యాలయం ఆవరణలోకి వచ్చి, కుక్కల నోటికి చిక్క శవమైన మచ్చల జింక కళేబరం సీఎం సారుకు కనిపిస్తున్నదా? పరమ పవిత్రమైన, అత్యున్నతమైన చట్టసభలో సభానాయకుడి హోదాలో నిలబడి అక్కడ జింకలు లేవు.. గుంటనక్కలే ఉన్నాయంటూ చేసిన మీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించమని సభాపతిని వేడుకుంటారా?
-హెచ్‌సీయూ విద్యార్థులు
HCU Land Issue | హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూలో శుక్రవారం మచ్చల జింకపై కుకలు దాడి చేశాయి. ఇన్నాళ్లుగా తమకు ఆశ్రయం ఇచ్చిన అటవీ ఆవాసం ఒక్కసారిగా చెదిరిపోవడంతో జింకలు సమీప కాలనీల్లోకి నీళ్ల కోసం వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. తమ ఇంటి ముందుకు వచ్చిన మూగజీవాలకు స్థానికులు నీళ్లు పెట్టి, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు. గురువారం సాయంత్రం ఒక దుప్పి సమీపంలోని గోపన్‌పల్లి అపార్ట్మెంట్లోకి వెళ్లగా స్థానికులు నీళ్లు పెట్టిన దృశ్యం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది.
ప్రభుత్వ బుల్డోజర్లు ధ్వంసం చేసిన అడవి నుంచే శుక్రవారం హెచ్‌సీయూ సౌత్ క్యాంపస్‌లోకి మచ్చల జింక ప్రవేశించినట్టు విద్యార్థులు చెప్తున్నారు. అటుగా వచ్చిన కుక్కల గుంపు జింక మీద దాడిచేయగా, సెక్యూరిటీ అధికారులు కుక్కలను దూరంగా తరమివేసి, విద్యార్థుల సహకారంతో ఆ జింకను హాస్పిటల్‌కు తరలించారు. దవాఖానలోనే జింక మరణించినట్టు తెలుస్తున్నది.
క్యాంపస్ లోపల జింకలు నిత్యం తిరుగుతూనే ఉంటాయి. వేసవికాలంలో ఎకువ సంఖ్యలో జింకలు బయటికి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయని, ఇందుకు ప్రధాన కారణం జంతువులకు నీటి సౌకర్యం లేకపోవడమేనని విద్యార్థులు చెప్తున్నారు. జింకలపై కుకలు దాడులకు పాల్పడ్డ ఘటనలు అనేకం ఉన్నాయని, ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు జింకలు చనిపోయాయని వివరిస్తున్నారు. ఇలాంటి సందర్భం ఎదురైన ప్రతిసారీ తాము జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్తున్నారు.
బయోడైవర్సిటీ శాస్త్రవేత్తల ఆధ్యయనాలు సైతం అందుబాటులోనే ఉన్నాయని, కంచ గచ్చిబౌలి స్క్రబ్ అడవుల్లో జింకలున్నాయో.. గుంటనక్కలే ఉన్నాయో..! పందికొక్కులే ఉన్నాయో? వచ్చి నిర్ధారణ చేసుకోవచ్చని విద్యార్థులు సవాలు చేస్తున్నారు. శుక్రవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డున అడవి ఉన్నదని నమ్మేవాళ్లు భ్రమల్లో బతుకుతున్నారని విమర్శించారు. అసలు అడవిలోనే జింకలు లేవని, ఇక్కడ జింకలు ఎక్కడివంటూ గ డుసుతనం ప్రదర్శించారు. అక్కడ ఓపెన్ భూములు ఉన్నాయి కాబట్టి, నెమళ్లు రావడానికి అవకాశం ఉన్నదని తెలిపారు. ఎంపీ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాయి.