Retirement Benefits | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ‘రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ డీఏలు, డీఆర్లు ఇవ్వకుండా ఎన్నాళ్లు కాలయాపన చేస్తారు? పెన్షనర్లపై ఇదే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో మా తడాఖా చూపుతాం’ అని పెన్షనర్స్ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏకంగా పీఆర్సీలు, డీఏలు అడగొద్దని సీఎం రేవంత్‌రెడ్డి నిస్సహాయతను వ్యక్తంచేయడం విడ్డూరమని విమర్శించారు. ఇక ఈ సర్కార్‌తో వేగలేకపోతున్నామని, మే 8 నుంచి పూర్తిస్థాయి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతామని పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది.
హైదరాబాద్‌లో ఆదివారం పెన్షనర్స్ జేఏసీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య మాటాడుతూ.. ప్రజల కోసం ఉచిత పథకాలు ప్రవేశపెట్టిన సర్కారుకు ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ప్రజల్లో భాగమేనని తెలియదా? అని ప్రశ్నించారు. నెలకు రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. ఐదు డీఏలను ఈ ప్రభుత్వం బాకీ పడిందని, కనీసం మూడు డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని మెరుగైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో 2.86 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాలు ఉన్నాయని, మున్సిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తడాఖా చూపుతామని లక్ష్మయ్య హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయంగా అందాల్సిన బెనిఫిట్లు ఇవ్వడమే లేదని, పెన్షనర్ల జీపీఎఫ్ ఖాతాల్లోని డబ్బును కూడా తీసుకోలేని పరిస్థితిని తేవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. సొంత డబ్బు తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని విమర్శించారు. రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం హైకోర్టుకు వెళ్లాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. అయినా తమ డబ్బుపై, తాము దాచుకున్న సొమ్ముపై ప్రభుత్వ అజమాయిషీ ఏమిటని ప్రశ్నించారు.
పెన్షనర్ల కుటుంబాల అవసరాలకు డబ్బు అందక అనేక మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. పిల్లల వివాహాలకు, దవాఖాన ఖర్చుల కోసం ఉపయోగపడటం లేదని, ఈ ఘోరమైన పరిస్థితులకు సర్కారు వైఖరే కారణమని ధ్వజమెత్తారు. ‘ఏప్రిల్ 1 నుంచి పెన్షనర్లకు నెలకు రూ.500 కోట్లు ఇస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. ఏప్రిల్ 1 వెళ్లిపోయింది. ఏప్రిల్ 20 కూడా దాటింది. ఐదు పైసలు కూడా వ్వలేదు. డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీలకే విలువ లేకపోతే ఏం ప్రయోజనం’ అని లక్ష్మయ్య విమర్శించారు. మెత్తారు. మే 7న జేఏసీ ఎన్నికలు జరుగుతాయని, మే 8 నుంచి పూర్తిస్థాయి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టంచేశారు.