సిరిసిల్ల రూరల్, మే 27: సౌదీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన మంద మహేశ్ కోలుకుంటున్నాడు. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవతో సౌదీ నుంచి స్వదేశానికి తీసుకువచ్చి హైదరాబాద్ కిమ్స్ దవాఖానలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. సోమవారం రాత్రి మహేశ్ ఎడమ కాలుకు వైద్యులు చేసిన సర్జరీ సక్సెస్ కావడంతో మూడు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం మహేశ్ కేటీఆర్‌కు ప్రత్యేకంగా మెసేజ్ చేశారు.‘అన్నా.. మీ రుణం తీర్చుకోలేనిది.. మీకు, పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటా.. పార్టీ కోసం పనిచేసినందుకు మరిచిపోలేని సహాయం చేశారు. మా కుటుంబ సభ్యులం మీకు రుణపడి ఉంటాం’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఖర్చులతో స్వదేశానికి తీసుకువచ్చి, కిమ్స్‌లో మెరుగైన వైద్యం చేయించిన కేటీఆర్.. మహేశ్ కోలుకోగానే ఉపాధి చూపిస్తామని హామీనిచ్చారు.