Ectopic Pregnancy | మెదక్ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో వైద్యులు సంయుక్త కృషితో మహిళ ప్రాణాలను కాపాడారు. కొల్చారం మండల పరిధి అంసాన్పల్లి గ్రామానికి చెందిన కేతావత్ సురేఖ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా కుటుంబీకులు ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రక్తపోటుతో మహిళ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. గైనకాలజిస్ట్ డాక్టర్ శివ దయాల్ పర్యవేక్షణలో వైద్యులు వసుధ, కిరణ్, దేవిశ్రీ, అనస్థీషియా సునీల్, ప్రజ్ఞా బృందం రెండు యూనిట్ల రక్తం ఎక్కించి సాధారణ స్థితికి తెచ్చారు. అయితే సదరు మహిళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో బాధపడుతుంది. అండాశయం (ఓవరీస్) నుంచి అండాన్ని గర్భసంచిలోకి వచ్చేలా తోడ్పడే ట్యూబ్స్ను ‘ఫెలోపియన్ ట్యూబ్స్’ అని పిలుస్తుంటారు.
అయితే, పలు సందర్భాల్లో పిండం గర్భసంచిలో బదులుగా ఈ ఫెలోపియన్ ట్యూబుల్లో పెరగడంతోపాటు ఒక్కోసారి అండాశయాల్లో (ఓవరీస్), కాస్తంత కిందికి వస్తే గర్భాశయ ముఖద్వారంలో ఒక్కోసారి కడుపులో కూడా పెరిగే అవకాశాలుంటాయి. ఈ సమస్యనే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’గా వైద్యులు పిలుస్తుంటారు. ఫెలోపియన్ ట్యూబుల్లో పిండం పెరగడం, పెరుగుదలకు తగ్గట్లుగా సాగలేకపోవడంతో ట్యూబులకు గాలయ్యాయి. దాంతో ట్యూబుల్లో రక్తస్రావమైంది. వెంటనే వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. దాదాపు రెండు గంటల పాటు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పూర్తిగా కోలుకున్న తర్వాత బుధవారం ఆసుపత్రి నుంచి డిశార్జి చేశారు. ఈ సందర్భంగా వైద్య బృందానికి బాధితురాలి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
సదరు మహిళకు అందించిన చికిత్స గురించి గైనకాలజిస్ట్ డా శివ దయాల్ మాట్లాడుతూ ఎక్టోపిక్ గర్భాన్ని కాపాడడం చాలా కష్టమన్నారు. ముందుగా తెలుసుకోకుండా ఉంటే అండవాహికల్లో పిండం పెరిగినప్పుడు అది పగిలిపోతుందని చెప్పారు. దీంతో పొట్టనిండా రక్తం చేరి తల్లికి ప్రాణాంతకంగా మారుతుందన్నారు. నొప్పి, బ్లీడింగ్ కావడం, తల తిరిగినట్టు అనిపించినప్పుడు పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితులు చాలా అరుదని పేర్కొన్నారు. సురేఖ ప్రాణాపాయ సంక్లిష్టత దృష్ట్యా సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ఏంసీహెచ్ వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా చంద్రశేఖర్ అభినందించారు.