NIMS | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రభుత్వరంగ వైద్యకళాశాల నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వెంటిలేటర్‌పైకి చేరుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిరుపేదల నుంచి మంత్రుల స్థాయి వరకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న దవాఖాన ప్రతిష్ఠ రోజురోజుకు మసకబారుతున్నది. దవాఖానలో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారుకావడంతో స్పెషలిస్ట్ డాక్టర్లు ఒక్కరొక్కరుగా కార్పొరేట్ దవాఖానలకు వలస కడుతున్నారు.
రోగుల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా తట్టుకుంటూ పనిచేస్తున్న వైద్య సిబ్బందిపై ఉన్నతాధికారుల వేధింపులు పెరిగిపోయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొఫెసర్ స్థాయి సీనియర్ వైద్యులను సైతం వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడే అధికారులను అందెలమెక్కించి, పనిచేసే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శిలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే పలువురు సీనియర్ వైద్యనిపుణులు నిమ్స్‌కు గుడ్‌బై చెబుతున్నారని టాక్. సర్జికల్ గ్యాస్ట్రో విభాగంలో దాదాపు 12ఏండ్లుగా పనిచేస్తున్న డాక్టర్ ఆదిత్యను రెండు సార్లు ఇంటర్యూకు పిలిపించి, పదోన్నతి ఇవ్వకపోవడమే కాకుండా పలు రకాలుగా వేధించడంతో ఇటీవలే ఆయన నిమ్స్‌కు గుడ్‌బై చెప్పినట్టు తెలిసింది. ఇలాంటి బాధితులు నిమ్స్‌లో చాలామంది ఉన్నట్టు సమాచారం.
నిమ్స్‌లో ప్రతిరోజు సగటున 3000 మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందుతారు. కాని రోగులకు తగిన సంఖ్యలో వైద్యసిబ్బంది లేక ఉన్నవారిపైనే పని భారం పడుతున్నది. 2012 నుంచి 2023 మధ్య నిమ్స్‌లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకపోవడంతో పదవీ విరమణ పొందిన వారి పోస్టులతో పాటు రాజీనామా చేసిన వారి పోస్టులు పలు విభాగాలలో ఖాళీగా ఉన్నాయి. ఉన్న వైద్యులే రోగులకు సేవలందించేందుకు గొడ్డు చాకిరి చేస్తున్నా అందుకు తగిన ఫలితం లేకపోవడంతో చాలామంది నిమ్స్‌ను వీడుతున్నట్లు తెలుస్తున్నది. సకాలంలో పదోన్నతులు కల్పించకపోవడం, ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ వంటివి అమలు చేయకపోవడం ప్రధాన కారణాలుగా వైద్యులు చెప్తున్నారు.
సాధారణంగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స, సర్జరీలు చేసిన వైద్యులకు ప్రత్యేక ఇన్సెంటివ్ ఇస్తారు. ఈ రూపంలో ఒక్కో సర్జన్‌కు నెలకు రూ. 50వేల నుంచి లక్ష వరకు వస్తుంది. ఇది పనిచేసే వైద్యలకు ప్రోత్సాహకంగానే కాకుండా వారు చేసిన పనికి ప్రతిఫలం కూడా. ఉస్మానియా, గాంధీ తదితర ఇతర ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీస్ చేసే వెసులుబాటు ఉంది. కాని నిమ్స్ వైద్యులకు ఆ వెసులుబాటు లేదు. దీంతో వారికి కనీసం ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ అయినా ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. అప్పట్లో రెండు మూడు నెలలపాటు ఇచిన హడావుడి చేసిన అధికారులు ఆ తరువాత ఇవ్వడం మానేశారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు వైద్యులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని, ఈ క్రమంలోనే బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం విజయ్‌భాస్కర్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి బలవన్మరణానికి పాల్పడినట్టు తోటి వైద్యులు తెలిపారు.
అన్ని ఇబ్బందులను తుట్టుకుంటూ పనిచేద్దామంటే సరైన వసతులు కల్పించడంలో నిమ్స్ ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని వైద్యసిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలలుగా దవాఖానలో కనీసం ఎక్స్-రే ఫామ్ కూడా అందుబాటులో లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యులు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో పది రోజుల క్రితం ఎక్స్-రే ఫామ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు సమాచారం.
సర్జికల్ ఇన్ఫ్రాస్టక్ఛర్ కూడా సరిగ్గా లేదని వైద్యులు ఆరోపిస్తున్నారు. సర్జికల్ పరికరాలు సరఫరా చేసే సప్లయర్స్‌కు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వారు సప్లయ్ నిలిపివేస్తున్నారని, దీంతో చాలా సందర్భాలలో ఆపరేషన్లు చేయడం ఇబ్బందిగా మారుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకాలంగా మీకు సప్లయ్ కాంట్రాక్ట్ ఇస్తున్నాం…మీరు నిమ్స్‌కు ఏమిస్తారు అంటూ పరోక్షంగా వెండర్స్ నుంచి కొందరు అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2022 నుంచి 2023 మే వరకు ఐదుగురు ప్రొఫెసర్లు నిమ్స్‌ను వీడగా తాజాగా 2024 నుంచి ఇప్పటివరకు గడిచిన 14 నెలల కాలంలోనే మరో ఐదుగురు నిమ్స్‌కు రాజీనామా చేసి వెళ్లిపోవడం యాజమాన్యం అస్తవ్యస్థ పాలనకు నిదర్శనం.