Law Course | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : ‘లా’ కోర్సు ఇటీవలీ కాలంలో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఒకటి. చివరకు ఇంజినీరింగ్‌లో కూడా సీట్లు మిగులుతున్నాయి.. కానీ లా కోర్సుల్లో మిగలడంలేదు. అంతగా ఈ కోర్సులకు డిమాండ్ ఉంటున్నది. ఇది వరకు ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులే లా కోర్సులో చేరేవారు. ఇటీవల బీఎస్సీ గ్రాడ్యుయేట్లు కూడా చేరిన దాఖలాలున్నాయి. తెల్లకోటు ధరించాల్సిన డాక్టర్లు, నల్లకోటు వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీర్లు లా కోర్సుపై మనసు పారేసుకుంటున్నారు.
ఈ సారి డాక్టర్లు, ఇంజినీర్లు లాసెట్‌కు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగిసింది. రూ. 500 ఆలస్య రుసుముతో ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఇప్పటి వరకు ఎంబీబీఎస్ డాక్టర్లు 107 మంది, దంత వైద్యులు 63 మంది, బీహెచ్ఎంఎస్ పూర్తిచేసిన వారు 22 మంది, బీఏఎంఎస్ అర్హత గల వారు 17 మంది సైతం లాసెట్‌కు దరఖాస్తుచేసుకున్నారు.
ఇక బీయూఎంఎస్ పాసైన వారు నలుగురు, బీఎన్‌వైఎస్ చదివిన వారు 8, ఫిజియోథెరపీ వారు 45 మంది, బీహెచ్ఎంసీటీ నుంచి 60 మంది లాసెట్‌కు దరఖాస్తుచేసుకున్నారు. లాసెట్‌కు ఆదివారం వరకు మొత్తంగా 53,165 దరఖాస్తులొచ్చాయి. నిరుడు మొత్తంగా 50, 567 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు 3వేల మంది అధికంగా దరఖాస్తులు సమర్పించారు. 8,423 మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు ఐప్లె చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 15% బీటెక్ వారి నుంచే వచ్చాయి. అర్కిటెక్చర్ 23, బీ డిజైన్ వారు ఐదుగురు, బీఎఫ్ఏ వారు 22 మంది దరఖాస్తు చేశారు.
కంప్యూటర్ కోర్సులైన బీసీఏ నుంచి 274, ఫార్మా -డీ పూర్తిచేసిన వారు 64, బీ ఫార్మసీ వారు 634 మంది దరఖాస్తులు సమర్పించారు. బిజినెస్, మేనేజ్మెంట్ కోర్సులైన బీబీఏ నుంచి 834, బీబీఎం నుంచి 114 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోషల్ వర్క్ కోర్సు పూర్తిచేసినవారు మరో 20 మంది లాసెట్‌కు దరఖాస్తు చేశారు. ఆలస్య రుసుములతో ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. జూన్ 6న లాసెట్ రాత పరీక్షను నిర్వహించనున్నారు.