ఖలీల్‌వాడి, అక్టోబర్ 27 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ వైద్యుడు జాల బాపురెడ్డి (75) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుది శ్వాస విడిచారు. ఫిజిషియన్‌గా నాలుగు దశాబ్దాలకుపైగా వైద్య సేవలందించారు. పూర్వపు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన బాపురెడ్డి.. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న బాపురెడ్డి ఎన్నికల సమయంలో బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఐఎంఏలోనూ పలు పదవులు అలంకరించారు. డాక్టర్ బాపురెడ్డి మృతికి వైద్యులు, నాయకులు సంతాపం తెలిపారు.
మెట్పల్లి రూరల్, అక్టోబర్ 27: హనుమకొండకు చెందిన పాకంటి ఉదయ్‌కుమార్‌రెడ్డి(29) మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మరికొందరు వైద్యులతో కలిసి ఆదివారం రెండు కార్లలో మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌కు వెళ్లారు. అక్కడ దావత్ చేసుకొని తిరిగి వస్తూ మార్గమద్యంలో విట్టంపేట వద్ద ఎస్సారెస్పీ వరదకాలువ వద్ద ఆగారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి, మరో వైద్యుడు ప్రశాంత్‌కుమార్ స్నానం చేసేందుకు వరదకాలువలో దూకగా ఉదయ్‌కుమార్‌రెడ్డి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. కొద్దిసేపటికి అతికష్టంపై ప్రశాంత్‌కుమార్ బయటకొచ్చాడు. గల్లంతైన వైద్యుని ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్టు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.