గూడూరు, జనవరి 25 : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శనివారం సాయంత్రం నర్సుపై వైద్యురాలు చేయి చేసుకున్నది. విశ్వనీయ సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం ఓ వ్యక్తి కడుపు నొప్పి వస్తున్నదని దవాఖానలోని వైద్యురాలి వద్దకు రాగా, పై అంతస్తులో ఉన్న ఇన్‌వార్డులో నర్సుల వద్దకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించింది.
దీంతో ఆ పేషెంట్ ఇన్‌వార్డుకు వెళ్లి విషయం నర్సుకు తెలుపగా, డాక్టర్ వద్ద మందులు లేదా, ఇంజెక్షన్ రాయించుకొని వస్తే వైద్యం చేస్తామని చెప్పింది. ఆ పేషెంట్ మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లగా.. దీంతో ఆగ్రహానికి గురైన వైద్యురాలు ఇన్‌వార్డు వద్దకు వెళ్లి పేషెంట్‌ను తన వద్దకు ఎందుకు పంపుతున్నావని వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి చివరికి నర్సుపై డాక్టర్ చేయి చేసుకున్నది. దీంతో మిగతా నర్సులు, వైద్యురాలికి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగినట్టు తెలిసింది.