Praja Palana | కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నెలబెట్టుకునేందుకే ప్రజాపాలన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రావడం ప్రజలకు ఇబ్బందని, అందుకే ప్రజలు ప్రభుత్వం వద్దకు రావడం కాదని, ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పుడు ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తుందన్నారు. పథకాల అమలు కోసం నిజమైన అర్హులు ఎవరు, ఎంత మంది ఉంటారనే లెక్క ప్రభుత్వం వద్ద ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే తాము ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తామన్నారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆయా గ్రామా పంచాయతీలు, పట్టణాల్లో దరఖాస్తు తీసుకుంటామని సీఎం తెలిపారు. అయితే ఒకవేళ ఎవరైనా వారి గ్రామంలో కౌంటర్లు ఓపెన్ చేసినప్పుడు దరఖాస్తులు ఇవ్వకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వాళ్లు 6వ తేదీ వరకు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులు అందించొచ్చని తెలిపారు. ఒకవేళ 6వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోలేకపోతే వాళ్లు ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో ఎప్పుడైనా దరఖాస్తు ఇవ్వొచ్చని సూచించారు.
ప్రజా పాలనలో భాగంగా కొత్త రేషన్‌కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని సీఎం తెలిపారు. అయితే కొత్త రేషన్‌కార్డుతో పాటు ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రేషన్‌కార్డు ఉన్నవారు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలని, లేనివాళ్లు మరో కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్యారంటీలతో పాటు అన్ని సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజా పాలనలో స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు కోసం సదరు వ్యక్తి స్వయంగా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి తరుపున ఎవరైనా ఇవ్వొచ్చని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే దరఖాస్తుదారుకు సంబంధించిన రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును దరఖాస్తుకు జత చేయాలని సూచించారు. సీఎం ప్రకటనతో ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారికి ఉపశమనం లభించినైట్లెంది.
దరఖాస్తులు తీసుకుంటున్న ఐదు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితి విధించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.