హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణ రాష్ర్టాన్ని రాజకీయాల పేరిట మలినం చేయొద్దని ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ సూచించారు. మనల్ని మనమే కించ పరుచకోవడం గొప్పవాళ్ల లక్షణం కాదని అన్నారు. శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా మాట్లాడండి, విమర్శించండి కానీ తెలంగాణ ఆస్థిత్వాన్ని దెబ్బతీసేలా నడుచుకోవద్దని హితవు పలికారు. ఒకనాడు తెలంగాణ నుంచి పొట్టకూటి కోసం ప్రజలు వలసలు పోతే, నేడు ఇతర రాష్ర్టాల నుంచి మనదగ్గరికి వలస వస్తున్నారని సీఎం తెలిపారు. బొంబాయి బస్సులు తిరిగిన జిల్లాలో వేరే జిల్లాల వాళ్లు వచ్చి పనిచేస్తుండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది. ఏ తెలంగాణ కావాలనుకున్నామో.. ఆ తెలంగాణ అయ్యింది. దీన్ని జర ఖర్చు చేయకండి. ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ. అందరం కలిసి దీన్ని మరింత గొప్పగా చేసుకుందాం. రాజకీయాల కోసం మాట్లాడండి.. మేం వద్దనం. మేం తప్పులు చేస్తే విమర్శించండి వద్దనం. కానీ రాజకీయాల పేరుతో మన తెలంగాణను మనమే మలినం చేయడం, మరోరకంగా చిన్నబుచ్చే ప్రయత్నం చేయడం మంచిది కాదు. తెలంగాణ వచ్చిన కొత్తలో ఓసారి మెట్రో రైలు ప్రతినిధి నా వద్దకు వచ్చారు. రాష్ట్రం విడిపోవడం వల్ల హైదరాబాద్ ప్రభ తగ్గిపోయింది. మెట్రోరైల్ ప్రయాణికులు తగ్గిపోయారు. కాబట్టి కేంద్రం ఇచ్చే వయబులిటీ ఫండ్ కోసం లెటర్ రాయాలని నన్ను కోరారు. నేను అప్పుడు సచివాలయంలో ఉన్న. నువ్వు మల్లగిట్ల కనిపిస్తివంటే ఈ ఆరో ఫ్లోర్ నుంచి కింద ఎత్తేస్త అని చెప్పిన. తిడితే నన్ను తిట్టు కానీ హైదరాబాద్‌ను తిడితే జాగ్రత్త అని చెప్పి పంపించిన’ అని సీఎం వివరించారు.
వలసల నేలకే.. నేడు వలస వస్తున్నరు
‘వివిధ రాష్ర్టాలకు చెందిన 15 లక్షల పైచిలుకు కార్మికులు మన రాష్ర్టానికి వచ్చి పొట్ట పోసుకుంటున్నారు. ఒకనాడు మహబూబ్‌నగర్ నుంచి బయట దేశాలకు మనం వలస పోయాం. నేడు ఇతర రాష్ర్టాల నుంచి మనవద్దకు వస్తున్నారు’ అని చెప్తూ.. ఎలాంటి ప్రాంతాల్లో నివసించాలో సుమతీ శతకంలోని పద్యాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపించారు. అప్పిచ్చువాడు, వైద్యుడు,ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్చొప్పడిన, యూరనుండుముచొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ‘ఎక్కడైతే ఈ సౌకర్యాలు అన్నీ ఉంటాయో అక్కడికే వెళ్లండి.. లేకుంటే వెళ్లకండి అని పెద్దలు చెప్పారు. తెలంగాణలో అప్పు ఇచ్చేవాడు ఉన్నడు. అద్భుతమైన వైద్యం ఉన్నది. అద్భుతమైన నీళ్లు ఉన్నయి. అద్భుతమైన కరెంటు ఉన్నది. అద్భుతమైన ఉపాధి ఉన్నది. అందుకే ఇక్కడికి అందరూ వస్తున్నరు’ అని చెప్పారు.