హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): జైనూర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొన్నదని, స్థానికుల్లో మనోధైర్యం కలిగించేందుకు చర్యలు చేపట్టామని తెలంగాణ పోలీస్ శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇరువర్గాలకు అవగాహన కలిగించి సాధారణ పరిస్థితి నెలకొనేలా కృషి చేస్తున్నట్టు తెలిపింది.అత్యంత సున్నితమైన ఈ అంశంపై వివిధ సామాజికవర్గాలను రెచ్చగొట్టేవిధంగా ఎలాంటి సామాజిక, రాజకీయ ప్రకటనలు చేయొద్దని కోరింది.
ఎవరైనా ప్రేరేపించే, ఉసిగొలిపే ప్రకటనలు చేస్తే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని, రెచ్చగొట్టే వార్తలు, అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఈ విషయంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు శాంతిభద్రతలు కాపాడేలా సహకరించాలని కోరింది.
జైనూర్‌లో ఆదివాసీ మహిళపై దాడికి సంబంధించిన వివరాలు అందించాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్‌ను జాతీయ ఎస్టీ కమిషన్ గురువారం ఆదేశించింది. ఘటన గురించి తెలుసుకున్న కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ గాంధీ దవాఖానకు వెళ్లి బాధిత మహిళను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాధితురాలిని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద సైతం పరామర్శించారు.