హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), ప్లాస్టిక్‌తో చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌తోపాటు ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయరాదని హైకోర్టు ఉత్తర్తులు జారీచేసింది. వాటిని కృత్రిమంగా ఏర్పాటు చేసిన కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్ర కాలుష్య మండలి (పీసీబీ) నిబంధనలను సవరించడాన్ని సవాలు చేస్తూ నిరుడు హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ గణేశ్ మూర్తి కళాకార్ వెల్ఫేర్ అసోసియేషన్, మరో ఎనిమిది మంది దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.