ఉట్నూర్/నార్నూర్, నవంబర్ 17: కొండగల్లో గిరిజన రైతులను ప్రభుత్వం వేధించొద్దని, వారిపై అక్రమ దాడులను ఆపాలని బంజారాలు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఆదివారం ఆదిలాబద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ జడ్పీటీసీ రాథోడ్ జనార్దన్ ఆధ్వర్యంలో.. నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద పీఏసీఎస్ చైర్మన్ ఆడే సురేశ్ ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెప్తున్నా.. ప్రభుత్వం లంబాడీ రైతులపై కక్షగట్టి హింసిస్తున్నదని విమర్శించారు. ఫార్మాసిటీకి భూములు తీసుకోవాలన్న ఉద్దేశంతో వారిపై కేసులు నమోదు చేస్తున్నదని ఆరోపించారు. వారిని విడుదల చేయడంతోపాటు కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.