ఏర్గట్ల/కమ్మర్పల్లి, మే 12: ‘మీరు వట్టి మాటలు చెప్తారు. మేము అభివృద్ధి చేస్తాం. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. చేసే వాళ్ల కు అడ్డుపడకండి’ అని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి నుంచి ఏర్గట్ల మండలం తడ్పాకల్ వరకు రూ.6.43 కోట్ల తో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు కమ్మర్పల్లి మండలం ఉప్లూర్, ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్, తడ్పాకల్లో శంకుస్థాపన చేశారు. ఏర్గట్ల మండలం తొర్తిలో రూ.1.45 కోట్లతో స్లాబ్ కల్వర్టు బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్టు తెలిపారు. 50 ఏండ్లలో జరగని అభివృద్ధి ఈ ఎనిమిదేండ్లలోనే జరిగిందని చెప్పారు. బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన ఎంపీ అర్వింద్ కూడా తనను విమర్శిస్తున్నాడని.. మాటల్లో కాకుండా అభివృద్ధిలో తనతో పోటీపడాలని సూచించారు. అర్వింద్ కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెచ్చి అభివృద్ధి చేశాడా? అని ప్రశ్నించారు. మంచి చేస్తున్న వారెవరో.. వట్టి మాటలు చెప్తున్న వారెవరో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
వారు అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉంటారని, తాము మాత్రం అభివృద్ధి చేస్తుంటామని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నాడో తెలియనాయన కూడా విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే పారిపోయాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ తన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతోపాటు తనను తిడితే పెద్ద వాళ్లమైపోతామని భ్రమపడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు అసత్యాలతో, వట్టి మాటలతో ఎంత తిడితే ప్రజల్లో తమకు అంత లబ్ధిచేకూరుతుందని చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తానెప్పుడూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.