కరీంనగర్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): తన మిత్రుడు ప్రవీణ్ చావుకు ఈటల రాజేందరే కారకుడని హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన సుంకెనపల్లి రాము అనే న్యాయవాది సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దానిని సీఎంవో కార్యాలయానికి మెయిల్ చేయడంతోపాటు రిజిస్టర్ పోస్టు కూడా చేసినట్టు వెల్లడించారు. పూర్తిస్థాయి విచారణ జరిపించి ఈటల రాజేందర్‌తోపాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను న్యాయవాది రాము కోరారు. అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల అధికారులను భయపెట్టో, ప్రలోభపెట్టో ఇప్పించిన ఉత్తర్వుల కాపీని అడ్డు పెట్టుకుని డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి రెచ్చిపోయాడని, తాను చెప్పిన తప్పుడు లెక్కలు రికార్డుల్లో నమోదు చేయనందుకు ప్రవీణ్ యాదవ్‌పై వేధింపులకు దిగాడని, చివరకు మరణానికి కారకుడయ్యాని ఆరోపించారు. దీని వెనకాల ఈటల ప్రోద్బలం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నదని, అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఈటలపై, డిప్యూటేషన్ ఉత్తర్వులు ఇచ్చిన అధికారులపై సివిల్ సర్వీస్ యాక్ట్ 1991 ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయవాది రాము సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో వివరించారు.