హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): జిల్లా వైద్యాధికారులు ప్రతి నెల ఒక రోజు పీహెచ్‌సీల్లో నిద్ర చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. తాను సైతం పీహెచ్‌సీల్లో నిద్ర చేస్తానని ప్రకటించారు. హెల్త్ క్యాలెండర్లో భాగంగా ఆదివారం పీహెచ్‌సీల పనితీరు, పురోగతిపై అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్సీడీ స్రీనింగ్, దవాఖానల్లో సీ-సెక్షన్ల రేటు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్, గర్భిణులకు అందుతున్న సేవలు, ఓపీ, టీబీ, టీ-డయాగ్నస్టిక్స్ తదితర సేవలపై పీహెచ్‌సీల వారీగా సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, సరైన చికిత్స అందిస్తే వ్యాధి తీవ్రం కాకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. ఇందులో పీహెచ్‌సీలది కీలక పాత్ర అని అన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు ప్రతి నెల అన్ని పీహెచ్‌సీలను తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఫలితాలు వస్తున్నాయి
వైద్యారోగ్యశాఖ కృషికి మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి హరీశ్ తెలిపారు. తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం రాష్ట్రంలో నవజాత శిశు మరణాల రేటు (ఐఎంఆర్) 23 నుండి 21కి తగ్గిందని, 2014లో 39గా ఉండేదని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ఐఎంఆర్ 28గా ఉన్నదని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మి, 102 వాహన సేవలు, మారుమూల ప్రాంతాలకు సైతం మెటర్నిటీ సేవలు విస్తరించటం, ప్రత్యేకంగా చిన్న పిల్లలకు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని, ఐఎంఆర్ తగ్గిందని వివరించారు. నాణ్యమైన ఆరోగ్య సేవలందిస్తున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని చెప్పారు. మొదటి స్థానానికి చేరాలని సూచించారు.
సిజేరియన్లు తగ్గాల్సిందే
రాష్ట్రంలో జరిగే డెలివరీల్లో ప్రస్తుతం 60 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి తగ్గాల్సిందేనని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 210 సబ్‌సెంటర్ల పరిధిలో 70 శాతం కంటే ఎకువ ప్రసవాలు ప్రైవేట్ దవాఖానల్లో జరుగుతున్నాయని, దీంతో సిజేరియన్లు ఎకువవుతున్నట్టు గుర్తించామని తెలిపారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆయా సబ్‌సెంటర్లపై 3 నెలలుగా ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. వచ్చే నెల నాటికి తీరు మారాలని తేల్చి చెప్పారు. ప్రైవేటు దవాఖానల్లో అనవసర సిజేరియన్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు.
సాధారణ ప్రసవాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వ డాక్టర్లు, నర్సులకు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ సేవలను పీహెచ్సీ స్థాయికి విస్తరించామని, వచ్చే మూడు నెలల్లో అన్ని కేంద్రాల్లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. పీహెచ్‌సీల్లో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని, 24 గంటలు నడిచే పీహెచ్‌సీలు అన్ని వేళల్లో అత్యవసర సేవలు అందించాలని స్పష్టం చేశారు.
వివరాలను ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాంలో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. దేశంలో అన్ని చోట్ల కరోనా కేసులు పెరుగుతున్నాయని, వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలని సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక ప్రజాప్రజాప్రతినిధుల సహకారంతో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేయాలని చెప్పారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.