హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): అధిక వడ్డీలు ఆశచూపి 17,500 మంది వద్ద నుంచి రూ. 229 కోట్లు కాజేసిన డీకేజెడ్, డీకాజూ టెక్నాలజీస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ దంపతులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన ప్రకారం.. గుడిమల్కాపూర్‌కు చెందిన డాక్టర్ అబ్దుల్ జైయిష్ జనవరి 2024న యూట్యూబ్ చానల్లో డీకేజెడ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, డీకాజూ టెక్నాలజీస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు చెందిన వీడియోలు చూశాడు.
వాళ్లు చేసే వ్యాపారానికి ఆకర్షితుడై మాదపూర్లో ఉన్న కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అష్ఫఖ్ రాహిల్, మేనేజర్లు మహ్మద్ ఇక్బాల్, సయ్యద్ ఉమర్అహ్మద్, మోహిజ్, నజీర్, బిలాల్‌ను కలిశాడు. తమవద్ద రూ. 5 వేల నుంచి ఎంత పెద్దమొత్తమైనా డిపాజిట్ చేయవచ్చని అందుకు 8 నుంచి 12 శాతం వడ్డీ చెల్లిస్తామని చెప్పారు. సేకరించిన డిపాజిట్లతో బీ2బీ, బీ2సీ వ్యాపారం చేస్తున్నామంటూ నమ్మించారు.
తాము మాదాపూర్‌లో డీకాజో, చాదర్‌ఘాట్‌లో అవర్లీ ఫ్రెస్, టోలిచౌకిలో మరో స్టోర్‌ను నిర్వహిస్తూ అమెజాన్‌తో భాగస్వామ్యం చేసుకొని రోజుకు 4 వేల అర్డర్లను డెలీవరీ చేస్తున్నట్టు వివరించారు. తమ స్టోర్స్ నుంచి కస్టమర్లకు డిస్కౌంట్ రేట్లలో హెడ్‌ఫోన్స్, నెక్బ్యాండ్స్విక్రయిస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మిన వైద్యుడు ఆగస్టులో రూ. 2.74 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత కొన్ని రోజులకే బోర్డు తిప్పేయడంతో బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భారీ సంఖ్యలో బాధితులు…!
ఈ సంస్థకు సంబంధించిన లావాదేవీలపై పోలీసులు ఆరా తీయడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ రికార్డుల్లో 17,500 మంది నుంచి రూ. 277 కోట్లు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో సేకరించినట్టు బయటపడింది. దీంతో సంస్థకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ అష్ఫఖ్ రాహిల్, డైరెక్టర్ సయ్యిదా అయిషానాజ్ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 564 గ్యారెంటీ అగ్రిమెంట్లు, సంస్థలకు చెందిన ఖాళీ లెటర్ హెడ్స్, 13 ల్యాప్‌టాప్‌లు, రూ. 1.7 కోట్ల నగదును సీజ్ చేశారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు వెల్లడించారు.