ఖైరతాబాద్, సెప్టెంబర్ 13 : తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయంటూ ఓ కంపెనీ తమ పుట్టిముంచిందని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో న్యాయవాది ఆషీర్ఖాన్, నారీ నికేతన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సఫియామాహి బాధితులతో కలిసి వివరాలు వెల్లడించారు. 2018లో నగరానికి చెందిన మాజీ ఐటీ ప్రొఫెషనల్ రాహిల్, మహ్మద్ ఇక్బాల్ మాదాపూర్‌లో డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థను ప్రారంభించారు. సయ్యద్ ఉమేయిర్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే ప్రతి నెలా 10 నుంచి 12 శాతం లాభాలు వస్తాయని నమ్మించారు. ప్రారంభంలో సజావుగా లాభాలు చెల్లించారు.
దీంతో దేశవ్యాప్తంగా 18వేల మంది లక్ష నుంచి రూ. 2 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. లక్షకు పైగా చెల్లించిన వారికి బాండ్ పేపర్ ఇచ్చారు. బక్రీద్, రంజాన్ ఆఫర్లంటూ రూ.700 కోట్లకు పైగా పెట్టుబడుల ద్వారా దోచుకున్నారు. ఈ నెల 4న బోర్డు తిప్పేసి, గూగుల్ నుంచి వెబ్‌సైట్‌ను కూడా తొలగించారు. మెహిదీపట్నంకు చెందిన ఓ వైద్యుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినా నిందితులపై సత్వరమే చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సీసీఎస్ వద్ద నిరసన చేపట్టారు.